- Advertisement -
రోడెక్కుతున్న పల్లీల రైతులు
Peanut Farmers are on the road
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 1, (వాయిస్ టుడే)
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, వికారాబాద్ ఇలా తెలంగాణవ్యాప్తంగా వేరుశనగ రైతులు రోడ్డెక్కుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండిచిన పంటకు గిట్టుబాటుధర కల్పించాలంటూ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే క్వింటా ధర ఏకంగా మూడువేలు తగ్గిపోవడంతో నష్టాలు తప్పవంటూ ఆందోళన చెందుతున్నారు. తెలంగాణాలో వేరుశనగ పంటపై ఆధారపడ్డ రైతులు ఎక్కువగానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ రైతులకు పెట్టిన పెట్టుబడి తిరిగి వెనక్కు రావడం అటుంచితే నిండా అప్పుల్లో మునిగిపోయే దుస్దితి ఏర్పడింది.తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో క్వింటా వేరుశనగ ధర ఏడువేల రూపాయల నుంచి ఏకంగా రెండు రోజుల్లో నాలుగువేలకు పడిపోయింది. ఇదేమని ప్రశ్నించేందుకు వెళ్లిన రైతులకు అధికారుల నుంచి బెదిరింపులు ఎదురవ్వడంతో రెచ్చిపోయారు. మార్కెట్ కమిటీ చైర్మెన్ ను చొక్కా చిరిగేలా కొట్టారు. వికారాబాద్ జిల్లాలో సైతం వందలాదిగా రోడ్డెక్కిన పల్లీ రైతులు, గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆందోళనలు చేశారు. రైతులు ఇంతలా రోడ్డెక్కడానికి ప్రధాన కారణం లాభాలు పక్కన పెట్టి కనీసం గిట్టుబాటు ధరకూడా రాకపోవడమే.గతంలో 500 రూపాయలు ఉండే ఎరువుల బస్తా ఇప్పుడు 1800 రూపాయలు పలుకుతోంది. విత్తానాల ఖర్చు పెరిగిపోయింది. పురుగు మందుల ధరలు సరేసరి. కూలీల ఖర్చులు సైతం భారంగా మారాయి. ఇలా పెరిగిన ధరలను భరించి, ఆరుగాలం శ్రమించి, వేరుశనగ సాగు చేస్తే ఏకంగా రెండు రోజుల్లో క్వింటాకు మూడువేల రూపాయలు అమాంతం పతనమవ్వడంతో రైతులు తట్టుకోలేకపోతున్నారు. తెల్లవారుజామున మూడు గంటలకు జోరున మంచుకురుస్తున్నా పల్లీలు కోసేందుకు వెళ్లి, రోజంతా పొలంలో శ్రమించి, మార్కెట్‌కు తీసుకొస్తున్నామనారు. ఇక్కడకు వచ్చిన తర్వాత మార్కెట్ కమిటీ, మిల్లర్లు కుమ్మకై ధరలు తగ్గిస్తున్నారని తెలంగాణలో వేరుశనగ రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అధిక వడ్డీలతో బయట అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాం, ఇప్పుడు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కు రాకపోతే ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణా వేరుశనగ రైతన్న.అయితే దీనిపై మార్కెట్ కమిటీ మరోలా స్పందిస్తోంది. వాతావరణ పరిస్థితులు కారణంగా ఈ ఏడాది వేరుశనగ పంటలో ఆశించిన స్థాయిలో నాణ్యత లేదు. పంట నాణ్యత లేకపోవడం వల్లనే ధరలు అమాంతం పడిపోయాయి. ఇదే విషయం రైతులకు వివరించే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. మా పంటకు నాణ్యత లేకపోతే రెండు రోజుల క్రితం క్వింటా ఏడువేల రూపాయలకుపైగా ఎందుకు ధర పలికింది. ఇప్పుడు కేవలం రెండు రోజుల్లోనే ఎందుకు ఇంతలా పతనమైంది. ఇందంతా మార్కెట్ కమిటీ అధికారులు చేస్తున్న కుట్ర, కావాలనే రైతులను మంచుతున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా వేరుశనగ రైతల పరిస్థితి దయనీయంగా మారింది. పంటలకు కనీసం గిట్టుబాటుధర కల్పిస్తామంటూ ప్రకటనలు చేసే ప్రభుత్వాలు, పల్లీ రైతలను ఆదుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇలాగే వదిలిస్తే గతంలో పత్తి రైతుల ఆత్మహత్యల తరహాలో పల్లీ రైతుల ఆత్మహత్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు రైతులు. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే రైతులకు న్యాయం చేయాలనే డిామాండ్ చేస్తున్నారు.
- Advertisement -