రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళి పాటించాలి–జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
Political parties should follow election rules--District Collector Rahul Sharma
జయశంకర్ భూపాలపల్లి,
రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళి పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా
కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో పట్ట భద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించే అంశంపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిథులతో సమావేశం నిర్బహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కాటారం, భూపాలపల్లి సబ్ డివిజన్లు పరిధిలో పట్ట భధ్రులు, ఉపాధ్యాయుల శాసన మండలి సభ్యుల ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికకు 215 మంది పురుషులు, 114 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. వీరి కోసం భూపాలపల్లి, మొగుల్లపల్లి, చిట్యాల, గణపురం, రేగొండ, టేకుమట్ల, కొత్తపల్లి గోరిలల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కాటారం డివిజన్ పరిధిలోకి వచ్చే ఉపాధ్యాయ శాసనమండలిలో 64 మంది పురుషులు, 19 మంది మహిళలు ఓటు హక్కు వినియోగానికి మహదేవ పూర్, మహా ముత్తారం, మల్హర్ రావు, కాటారం, పలిమెలలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పట్ట భద్రుల శాసన మండలి ఎన్నికల్లో 1734 మంది. పురుషులు, 749 మంది మహిళలు ఓటు హక్కు వినియోగానికి మహాదేవపూర్, మహా ముత్తారం, మల్హార్ రావు, కాటారం, పలిమేలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో
మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్-కరీంనగర్ స్థానాలతో పాటు వరంగల్-ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న జారీ అయిందని ఫిబ్రవరి 10వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన, నామి నేషన్ల ఉప సంహరణకు ఫిబ్రవరి 13 వరకు గడువు విధించారని తెలిపారు. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, మార్చి 3వ తేదీన
ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బంధీగా అమలు చేయడానికి టీములు ఏర్పాటు చేశామని, ప్రచారానికి సంబంధించి అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమ నిబంధనలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల ప్రవర్తనా నియమాలు అమల్లో జిల్లా యంత్రాంగపు ఆదేశాలు పాటించాలని సూచించారు. ఈనెల 10వ తేదీన గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు ఓటరు జాబితా అందజేస్తామని ఆయన తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గానికి ఆర్డిఓ, మంథని నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మండలాలకు కాటారం సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఎంసీఎంసీ నోడల్ అధికారి శ్రీనివాస్, తహసిల్దార్ శ్రీనివాసులు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అబ్బాస్, ఇమామ్ బాబా ,నవీన్, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు .