ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించండి
గుణాత్మకమైన విద్యను విద్యార్థులకు బోధించండి
రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
నంద్యాల
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.
బుధవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు అధ్యక్షత వహించి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించడంతోపాటు మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక వసతులతో కూడిన ఫర్నిచర్ తో పాటు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ చేస్తుందన్నారు. తాను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి పాఠశాల వసతులపై చేసిన కృషిని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో అదనపు గదులు, వసతులను మెరుగుపరచడం తదితర అంశాలపై డిఇఓ ప్రతిపాదించిన అంశాలను పరిగణలోనికి తీసుకొని పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పాఠశాలల అవసరాలు, సమస్యలు తన దృష్టికి తెస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరింత అభివృద్ధికి తోడ్పడతానని మంత్రి వివరించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడేలా విద్యాభ్యాసాన్ని అందించాలని మంత్రి కోరారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులతో కూడిన సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ మెనూ ప్రకారం ఆహార పదార్థాల సరఫరలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. విద్యా బోధనకు అవసరమయ్యే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు ఇతర పరికరాలను స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ ద్వారా విద్యార్థులందరికీ పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలో స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల హెడ్మాస్టర్లను కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం ప్రభుత్వ బాలికల పాఠశాల, కేజీబీవీ జనరల్, కేజీబీవీ మైనారిటీ, చిన్మయ పాఠశాలల విద్యార్థులకు మంత్రి, కలెక్టర్ స్టూడెంట్స్ కిట్స్ లను పంపిణీ చేశారు. అంతకుముందు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మల్లికార్జున రెడ్డి, తాసిల్దార్ చంద్రశేఖర్, డీఈవో సుధాకర్ రెడ్డి, ఏఎంఓ లలిత కుమారి, నంద్యాల ఎంఈఓ బ్రహ్మం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మావతి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.