ప్రజా అర్జీలను వెంటనే పరిష్కరించాలి ….స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ
Public petitions should be addressed immediately...Additional Collector of Local Bodies Srija
ఖమ్మం:
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్, డిఆర్వో ఏ. పద్మజ, డిఆర్డీవో సన్యాసయ్య లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజావాణికి సంబంధించి వచ్చిన ప్రతి అర్జీనీ పరిశీలన చేసి పెండింగ్ లో లేకుండా వెంటనే పరిష్కరించాలని అన్నారు.
రఘునాథపాలెం మండలం చింతగట్టు రెవెన్యూ గ్రామానికి చెందిన కే. ద్రౌపది గ్రామంలో తనకు ఒక ఎకరం 15 గుంటల వ్యవసాయ భూమి ఉందని, ఆ భూమికి రైతు భరోసా డబ్బులు, ఉపాధి హామీ కూలీ డబ్బులు, గ్యాస్ సబ్సిడీ డబ్బులు తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ నందు జమ కాగా, బ్యాంకు వారు ఆ డబ్బులను రుణం క్రింద నిలిపివేయడం జరిగిందని, ఆ డబ్బులు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, లీడ్ బ్యాంక్ మేనేజర్ కు రాస్తూ వెంటనే పరిశీలించి సమస్య పరిష్కరించాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామానికి చెందిన సి.హెచ్. మట్టయ్య తనకు జారీ చేసిన సదరం సర్టిఫికెట్ లో పేరు తప్పుగా నమోదయిందని, దీని వల్ల తనకు ఫించన్ రావడం లేదని, తనకు ఫించన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, డిపిఎం చేయూతకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఖమ్మం నగరం విడిఓస్ కాలనీకి చెందిన ఎస్. ప్రసాద్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తనకు నాలుగో విడతలో రుణమాఫీ కాలేదని, రుణమాఫీ పూర్తి చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా సహకార అధికారికి రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఏ. అరుణ, తదితరులు పాల్గొన్నారు.