పేటీఎంపై ఆర్బీఐ కొరడా.. నిలిచిపోనున్న సేవలు.. పూర్తి వివరాలు ఇవి..
పేటీఎం.. ఈ పేరు వినని వారు మన దేశంలో ఉండరంటే అతిశయోక్తి కాదేమో. బ్యాంకింగ్ రంగం డిజిటలీకరణలో పేటీఎం తన వంతు పోషించింది.
అయితే ఇటీవల కాలంలో వెంటాడుతున్న నష్టాలు, మార్కెట్లో విపరీతమైన పోటీతో పేటీఎం ప్రభ తగ్గుతూ వస్తోంది.
ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మరో షాక్ ఇచ్చింది.
పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది.
ఫిబ్రవరి 29 నుంచి కొత్త డిపాజిట్లు తీసుకోవడం, క్రెడిట్ ట్రాన్సాక్షన్‌లు చేపట్టకూడదని ఆదేశించింది.
దీంతో వ్యాలెట్లు, ఫాస్ట్ ట్యాగ్, ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్లు చేయడం వీలు పడదు.
దీనిప్రభావం పేటీఎంపై చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రకటన వచ్చిన గంటల వ్యవధిలోనే పేటీఎం షేర్లు దారుణంగా పడిపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోంది.
ఎందుకింత కఠిన నిర్ణయం..
గత కొంత కాలంగా పేటీఎం పనితీరు సజావుగా సాగడం లేదు. ఈ క్రమంలో పలు ఆడిట్ నివేదికలు బహిర్గతం అయ్యాయి. వాటిల్లో ఈ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనేక ఉల్లంఘనలు గుర్తించినట్లు ఆర్బీఐ ప్రకటించింది. మానిటరీ పాలసీ, ఇతర నిబంధనలు, మార్గదర్శకాలు పాటించడం లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌పై కొరడా ఝుళిపించాల్సి వచ్చింది వివరించింది. ఈ చర్యలతో పేటీఎం మాతృ సంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, పేటీఎం బ్యాంకు లిమిటెడ్ నోడల్ అకౌంట్లను సైతం రద్దవుతాయి. 2022లో సైతం ఆర్బీఐ ఒకసారి పేటీఎంపై చర్యలు తీసుకుని కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశాలుజారీ చేసిన సంగతి తెలిసిందే.
విత్‌డ్రాకు ఇబ్బంది లేదు..
ఈ ఆంక్షల నేపథ్యంలో ఇప్పటికే పేటీఎం వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది.అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు తన నగదును వినియోగించుకోవచ్చని, ఎలాంటి ఆంక్షలు లేవని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. బ్యాంక్ లోని కరెంట్, సేవ్సింగ్స్, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్, నేషనల్ మొబిలిటీ కార్డు, ఫాస్టాగ్ సహా ఇతర ఏ ప్లాట్ ఫారం నుంచైనా నగదు విత్ డ్రా చేసుకునేందుకు ఎటువంటి ఇబ్బందీ లేదని వివరించింది. అలాగే పేటీఎం ఇచ్చే రిఫండ్లు, క్యాష్‌బ్యాక్స్, వడ్డీలపైనా ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. అయితే పేటీఎం యూపీఐ పేమెంట్లపై ఎలాంటి ప్రభావం చూపదని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.