Thursday, December 12, 2024

నిజంగా… నియోజకవర్గ అభివృద్ధి కోసమేనా ?

- Advertisement -

నిజంగా… నియోజకవర్గ అభివృద్ధి కోసమేనా ?
కేటీఆర్ వ్యూహం ఏమిటీ
హైదరాబాద్, జనవరి 30,
తెలంగాణలో కాంగ్రెస్ కొలువు తీరి దాదాపు రెండు నెలలు కావస్తోంది. పార్లమెంట్ ఎన్నికల కోసం మరోసారి కాంగ్రెస్,  బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. సీఎంగా రెండు నెలలు పూర్తి చేసుకోనున్న రేవంత్ రెడ్డి మళ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సారధ్యం వహించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలతో సమావేశమై సమీక్షలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో  ఓటమి నుంచి క్యాడర్ ను బయటకు తెచ్చి, వారిలో స్ఫూర్తి నింపే బాధ్యతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావులు భుజాన ఎత్తుకున్నారు.త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటన ఉంటుందని గులాబీ నేతలు చెబుతున్నారు. ఈ తరుణంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి( దుబ్బాక), సునీత లక్ష్మారెడ్డి (నర్సాపూర్) మాణిక్ రావు (జహీరాబాద్), గూడెం మహిపాల్ రెడ్డి( పఠాన్ చెరు) కలవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలం సృష్టించింది. ఈ నలుగురు కలిసిన తర్వాత తాజాగా బీఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్) సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చాంశనీయంగా మారింది.ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిసినప్పుడు చెప్పిన కారణం ఏంటంటే తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కలిశామన్నారు. అంతే కాకుండా జిల్లాలో ప్రోటోకాల్  అమలు, సెక్యూరిటీ పెంపు వంటి అంశాలు చర్చించామని, అంతే తప్ప బయట ప్రచారంలో ఉన్నట్లు తాము కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని వివరణ ఇచ్చారు. కేసీఆర్ నాయకత్వంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడిస్తామంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకంపనలు ముగియకమునుపే.. తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సైతం రేవంత్ రెడ్డిని కలవడం అసలేం జరుగుతోందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రకాష్ గౌడ్ సైతం ఆ నలుగురు ఎమ్మెల్యేలు సీఎంను కలిసినప్పుడు ఏం చెప్పారో అదే చెప్పడం గమనార్హం. తాను కూడా తన నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని చెప్పడం విశేషం. తాను పార్టీ మారడం లేదని మీడియాకు వివరణ ఇచ్చారు.
ఆ నలుగురు గులాబీ బాస్ కు చెప్పే కలిశారా ?
అయితే ఉమ్మడి మెదక్ జిల్లా నుండి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్  అనుమతితోనే కలిశారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లా.. మాజీ సీఎం, అంతే కాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వంత జిల్లా. అదే జిల్లా నుండి బీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్ రావు ఉన్నారు. ఆ జిల్లా నుండి నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం గులాబీ పార్టీలో కలకలం రేపింది. అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుల అనుమతితోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారా… లేదా ఇది వారి స్వంత నిర్ణయమా అన్న విషయం సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కారణం ఏదైనా.. పార్టీ అధినేత కేసీఆర్ కు సమాచారం ఇచ్చి కలిసారా లేదా అన్నదే ఇప్పుడు అందరిలోను ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
తాజాగా రంగారెడ్డి జిల్లా నుండి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్ సైతం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం హాట్ టాపిక్ గామారింది. ప్రకాశ్ గౌడ్ సైతం నలుగు ఎమ్మెల్యేలు చెప్పిన కారణమే రేవంత్ రెడ్డిని కలసిన తర్వాత చెప్పడం విశేషం. నియోజకవర్గ  అభివృద్ధి తప్ప తాను పార్టీ మారడం లేదని, ఇందులో రాజకీయ కోణమేది లేదని వివరణ ఇచ్చారు. అయితే సీఎంగా రేవంత్ రెడ్డి పదవి చేపట్టి రెండు నెలలు కాకముందే నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కలవడం మాత్రం అందరిలోను ఉత్కంఠకు తెర లేపింది. ఇప్పటికిప్పుడు అభివృద్ధి పనులు ఏంటా… అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మెదక్ జిల్లా విషయానికి వస్తే  గతంలో సీఎంగా కేసీఆర్ తొమ్మిదన్నరేళ్లుగా ఉన్నారు. మంత్రి హరీశ్ రావు కూడా దాదాపు 9 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, గూడెం మహిపాల్ రెడ్డి, అటు కేసీఆర్ తోను, హరీశ్ రావుతోను సాన్నిత్యం ఉన్నవారే.
ఏ నిధులు అడిగినా కాదనకుండా స్వంత జిల్లా కాబట్టి వెంటనే పనులు జరిగేవి. సునీతా లక్ష్మారెడ్డికి ముందున్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గం విషయంలో పలు మార్లు అప్పటి సీఎం కేసీఆర్ ను, మంత్రి హరీశ్ రావును కలిసి చాలా పనులు చేయించుకున్న తీరు  ఆ నియోజకవర్గంలో అందరికీ తెలిసిందే.  అయితే  రేవంత్ రెడ్డి  సీఎంగా పగ్గాలు చేపట్టి రెండు నెలలు కూడా పూర్తి కాకముందే అభివృద్ధి పనుల కోసం కలిసామని చెప్పడం వెనుక ఆంతర్యమేంటన్నది రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ. దీనికి ఆ ఎమ్మెల్యేలే సమాధానం చెప్పాల్సి ఉంది. సాధారణంగా సీఎంను కలిస్తే  అభివృద్ధి పనుల మీద  వినతి పత్రం సమర్పిస్తారు . కాని అలాంటి వినతపత్రమేది విడుదల చేయకపోవడం గమనార్హం.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్ నలుగురే.. అది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితలు. ఏ ఛాన్స్ దొరికినా రేవంత్ రెడ్డి ఆ నలుగురిపైన నిప్పులు చెరిగేవారు. అయితే ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ టార్గెట్  ఆ ముగ్గురు నాయకత్వం వహించే జిల్లాల నుండే స్టార్ చేశారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.   ఉమ్మడి మెదక్ జిల్లా నుండి  కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ జిల్లాలో రాజకీయ మంత్రాంగం అంతా హరీశ్ రావు కనుసన్నల్లోనే జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్  లోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసింది  ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్. ఇలా  ఈ ముగ్గురే టార్గెట్ గా ఆ ఐదుగురు ఎమ్మెల్యేలతో భేటీ జరిగిందా..? బీఆర్ఎస్ కు ఇలా షాక్ ఇచ్చే లా రేవంత్ రాజకీయ వ్యూహం పన్నారా ? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత రాజకీయాల్లో  పార్టీ అధినేతకు సమాచారం ఇవ్వకుండా, ఇతర పార్టీ ముఖ్యనేతలను కాని, సీఎంను గాని, మరో పార్టీ  ఎమ్మెల్యేలు కలవడం అనేది పలు సందేహాలకు తావిస్తుంది. ఈ విషయం సీనియర్ ఎమ్మెల్యేలందరికీ తెలుసు. అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను ధైర్యంగా కలిసారంటే దీని వెనుక ఆపరేషన్ ఆకర్ష్ కారణామా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే సీఎం ను కలిసిన ఎమ్మెల్యేలు మాత్రమే తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారే తప్ప.  ఆ పార్టీ అధినాయకత్వం మాత్రం ఈ పరిణామాలపై ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల కోసం రేవంత్ పావులు కదుపుతున్నారా ?
వచ్చే నెలలో ( ఫిబ్రవరి నెలలో)  పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఉమ్మడి పది జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెల్చుకోలేనివి మూడే. అవి  రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలు. బీఆర్ఎస్ 39 సీట్లు గెలిస్తే అందులో మెదక్ జిల్లా నుండి 7 సీట్లు, రంగారెడ్డి జిల్లాలో పది సీట్లు, హైదరాబాద్ జిల్లాలో 7 సీట్లు గెల్చుకుంది. అంటే 39 సీట్లలో 24 సీట్లు ఈ మూడు జిల్లాల్లోనే గులాబీ పార్టీ నెగ్గింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బ తీయాలంటే మెజార్టీ స్థానాలు గెల్చుకున్న హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ ను పటిష్టం చేయడమే రేవంత్ రెడ్డి ముందున్న లక్ష్యంగా ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.  ఈ మూడు జిల్లాల్లో  ఆరు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల, మెదక్ ఎంపీ స్థానాలు ఈ జిల్లాల పరిధిలో ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ పార్లమెంట్ సీటు  ఎం.ఐ.ఎంకు వదిలేస్తే మిగిలిన, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ ఎంపీ స్థానాలు తప్పనిసరిగా గెల్చుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారా అన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి.
అయితే 30 మంది  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ చేతిలోనే ఉన్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు  ఈ పరిణామాలను బలపరుస్తున్నాయి. ఏది ఏమైనా ఈ భేటీల వెనుక ఉన్న అసలు సిసలు కారణాలు పార్లమెంట్ ఎన్నికల ముందు బయపడుతుందేమో వేచి చూడాల్సిందే.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్