రేవంత్‌రెడ్డికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదు

- Advertisement -

రేవంత్‌రెడ్డికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదు: మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్‌ నవంబర్ 12
తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అందుకే కరెంటు, రైతుబంధు, ధరణి గురించి ఆయన నోటికొచ్చింది మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఆదివారం ములుగు జిల్లాకు చెందిన పలువురు నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీ రైతుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ కరెంటు విషయంలో తప్పుల మీద తప్పులు చేస్తోందని ఆరోపించారు. ఇక్కడ 24 గంటల కరెంటు ఇస్తుంటే కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని డీకే శివకుమార్‌ గొప్పలు చెబుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ హయాంలో కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లే దర్శనమిచ్చేవని గుర్తుచేశారు. ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని మంత్రి విమర్శించారు.సీఎం కేసీఆర్‌ పనితనమే తప్ప పగతనం తెలియని వ్యక్తని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. కేసీఆర్‌ అంటే ఒక నమ్మకం, భరోసా అని అన్నారు. కేసీఆర్‌ పాలనలో కరువు కాటకాలు లేవని చెప్పారు. పల్లెల్లో సాగునీటికి, హైదరాబాద్‌లో తాగు నీటికి ఇబ్బంది లేదన్నారు. కేసీఆర్‌ ముందు చూపుతో ప్రాజెక్టులు నిర్మించడంతో పంటలు సమృద్ధిగా పండుతున్నాయని తెలిపారు. ములుగు జిల్లా ప్రజలపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉందని చెప్పారు.కమలాపూర్‌ ఫ్యాక్టరీని తెరిపించేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేశారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కమలాపూర్‌ ఫ్యాక్టరీతో 10 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ములుగు ప్రజలపై అభిమానంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ములుగు జిల్లాను ఏర్పాటు చేశారని మంత్రి చెప్పారు. ములుగు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నాగజ్యోతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ అని, ఆమెను గెలిపిస్తే జిల్లా ఇంకా అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular