ప్రజా జీవితంలో నిత్యం తీరిక లేకుండా గడిపే రాజకీయ నాయకులు సమయం చూసుకోకుండా ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. ఒక్కోసారి తక్కువ వ్యవధిలోనే చాలా కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎప్పుడు పడితే అప్పుడు ప్రయాణాలు చేస్తుంటారు. ఇదే ఒక్కోసారి వారి ప్రాణాల మీదకు తెస్తోంది. పలు సందర్భాల్లో ఉదయపు ప్రయాణాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇలాగే ఓ కార్యక్రమానికి ఉదయాన్నే వెళుతూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కొందరు నాయకులు కూడా గతంలో ఉదయం జరిగిన ప్రమాదాల్లోనే మృతిచెందారు. తెలుగుదేశం నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు విశాఖపట్నంలో ఓ వివాహానికి హాజరై తిరిగి వెళుతుండగా 2012 నవంబరు 2వ తేదీ తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. తెలుగుదేశం నాయకుడు లాల్‌జాన్ పాషా 2013 ఆగస్టు 15న హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతుండగా నకిరేకల్ వద్ద ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ 2018 ఆగస్టు 29న నార్కెట్‌పల్లి-అద్దంకి హైవేపై ఉదయం 6 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 2002 మార్చిలో లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న జీఎంసీ బాలయోగి మరణించింది కూడా ఉదయాన్నే.. అయితే ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు.
ఆ సమయంలో ఎందుకు?
సాధారణంగా ప్రజాజీవితంలో ఉన్న నాయకులు తమ దైనందిన కార్యక్రమాలను ఉదయాన్నే మొదలు పెడుతుంటారు. నియోజకవర్గ పర్యటనలకు వెళ్లాలన్నా, ఏదైనా శుభకార్యానికి లేదా ఇతర కార్యక్రమాలకు హాజరుకావాలన్నా సాధ్యమైనంత త్వరగా బయల్దేరుతుంటారు. వివాహాల సీజన్‌లో అయితే ఒక్కోసారి పది వరకూ హాజరుకావాల్సి ఉంటుంది. ఒక్క కార్యక్రమానికి హాజరుకాకపోయినా తనపై వ్యతిరేకత వస్తుందేమో అన్న భయం నాయకులను వెంటాడుతుంటుంది. అందుకే తాము ఎంత ఇబ్బంది పడ్డా పిలిచిన వాటన్నింటికీ హాజరవుతుంటారు. ప్రధానంగా ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడో, ఎక్కువ కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉన్నప్పుడో తెల్లవారుజామునే బయలుదేరుతుంటారు. వీరితోపాటు వీరి డ్రైవర్లకు కూడా సరిగా నిద్ర ఉండదు. అర్ధరాత్రి వరకూ వీరితోనే ఉండే డ్రైవర్లు మళ్లీ ఉదయాన్నే విధులకు హాజరవుతుంటారు. ఒక్కోసారి వారు త్వరగా అలసిపోతుంటారు. అన్నింటికంటే ముఖ్యంగా త్వరగా వెళ్లాలన్న ఉద్దేశంతో వాహనాన్ని వేగంగా నడపాలని నేతలు డ్రైవర్లను కోరుతుంటారు. నెమ్మదిగా వెళితే అన్ని కార్యక్రమాలూ అందుకోలేమన్న ఉద్దేశంతో డ్రైవర్లు కూడా వేగంగా వాహనాలు నడుపుతుంటారు. ఇటువంటి కొన్ని సందర్భాల్లో ఒక్కోసారి వారి ప్రాణాల మీదకు వస్తోంది. ఉదయపు వేళ మంచు కురవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది….