సేవాలాల్ మహరాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి
Sevalal Maharaj Jayanti should be declared as a holiday
ఎల్ హెచ్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రాంబల్ నాయక్ డిమాండ్
గొర్ బోలి భాషను అసెంబ్లీలో తీర్మానించాలి
షాద్ నగర్
పట్టణంలో ఎల్ హెచ్ పీఎస్ దీక్ష
సేవాలాల్ మహారాజ్ జయంతిని దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్.హెచ్.పి.ఎస్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రాంబల్ నాయక్ డిమాండ్ చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా నిర్వహించిన ఒకరోజు దీక్షలో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి మిట్టు నాయక్, మోహన్ నాయక్ లక్ష్మణ్ నాయక్ హనీయా నాయక్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంబల్ నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో 12 కొట్ల జనాభా గల బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం బాల బ్రహ్మచారి శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15న దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో దీనికి తీర్మానం ప్రవేశపెట్టి తద్వారా ఢిల్లీలో కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. బంజారా జాతి వారు 29 రాష్ట్రాలలో లంబాడ భాషలో
మాట్లాడగా వారిని ఏకం చేసి బంజారాల సమాజాభివృద్ధికి కృషిచేసిన సేవాలాల్ మహారాజ్ సేవలు మరువలేనివన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా దేశంలోని అన్ని తండాల్లో భవాని మాత, సేవాలాల్ మహారాజ్ ఆలయాల వద్ద సాంప్రదాయాలతో పెద్ద ఎత్తున మహా బోగ్ బండార్ పూజలను నిర్వహించుకుంటారని, అట్టి రోజును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఆచరిస్తూ గోర్ బోలి భాషను మాట్లాడుతున్న 12 కోట్ల మంది గిరిజనులకు న్యాయం జరిగేలా ఈ భాషను అధికారికంగా చూడాలని అన్నారు. కేవలం గోవాలో 30 లక్షల మంది మాట్లాడే కొంకిణి భాషను అధికారికంగా ప్రకటించారని మరి 12 కోట్ల జనాభా గల గిరిజన భాషను కూడా రాజ్యాంగంలో చేర్చాలని అన్నారు. గత కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేసిందని గుర్తు చేశారు. జనపదామషప్రకారం రాష్ట్రంలో 3147 తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా చేశారని గుర్తు చేశారు. ఆరు శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్ ను కెసిఆర్ 10% చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా తమకు మిగిలిన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఇందులో ముఖ్యంగా గోర్ బోలి భాషను అధికారికంగా గుర్తించేందుకు సహకరించాలని డిమాండ్ చేశారు. వెంటనే అసెంబ్లీలో తీర్మాన ప్రవేశపెట్టి దానిని కేంద్రానికి పంపాలన్నారు. అదేవిధంగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి 500 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయాలని కోరారు. గిరిజన సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు.