కాంగ్రెస్ లోకి డీఎల్, కడప నేతలతో షర్మిల మంత్రాంగం
బద్వేలు
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తిని పెంచుతోంది. నేతల పార్టీల మార్పు వేగంగా జరుగుతోంది. ఏపీలో పట్టు పెంచుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. వైసీపీ సీట్ల ఖరారు వేళ సీటు ఖరారు కాని నేతలు కొందరు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. షర్మిల సైతం గతంలో కాంగ్రెస్ లో పని చేసిన నేతలను తిరిగి యాక్టివ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కడప జిల్లా సీనియర్లను పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు.కడప జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. 2014 వరకు కాంగ్రెస్ లో పని చేసిన డీఎల్ రవీంద్రారెడ్డి చివరగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి దగ్గరయ్యారు. కొంత కాలంగా జగన్ వ్యవహార శైలి, ప్రభుత్వం పైన డీఎల్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాను ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలో చేరుతానని చెబుతూ వచ్చారు. డీఎల్ సొంత నియోజకవర్గం మైదుకూరులో టీడీపీ నుంచి సుధాకర్ యాదవ్ ఉన్నారు. టీడీపీలో చేరినా సీటు దక్కే అవకాశం లేదు. దీంతో, డీఎల్ తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారని కడప పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.