- Advertisement -
తెలుగు రాష్ట్రాలపై సింగ్ ముద్ర
Singh's imprint on the Telugu states
హైదరాబాద్, డిసెంబర్ 27, (వాయిస్ టుడే)
మన్మోహన్ సింగ్‌కు తెలుగు రాష్ట్రాలతో విడదీయలేని అనుబంధం ఉంది. ప్రధానిగా పేదలకు ఉపయోగపడే పథకాలను తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్. పేదలు పస్తులు ఉండొద్దన్న ఉద్దేశంతో పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకాన్ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించారు. అనంతపురంలో ఉపాధి హామీ పథకాన్ని లాంచ్ చేశారు మన్మోహన్ సింగ్. ఈ పథకం యూపీఏ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి పెట్టింది. అలాగే పేదల కడుపు నింపింది.మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ ఏపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారని.. కేంద్ర కేబినెట్‌లో ఉన్న ఏపీ నేతలు రాజీనామా చేస్తామన్నా మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదన్నారు హస్తంపార్టీ నేతలు. పార్లమెంట్‌లో రచ్చజరిగినా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు మన్మోహన్ సింగ్. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాస్ చేయించేందుకు మన్మోహన్ సింగ్ కీలక భూమిక పోషించారన్నారు అప్పటి కేంద్రహోంమంత్రి షిండే .కాంగ్రెస్ అధికారం కోల్పోయాక విభజన సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేశారు మన్మోహన్ సింగ్. విభజన హామీలన్నీ కేంద్రం నెరవేర్చాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు మన్మోహన్ సింగ్. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే తప్పకుండా ప్రత్యేక హోదా ఇచ్చేవాళ్లమన్నారు.మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు తెలంగాణ సీఎం. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ కృషి ఎప్పటికీ మరవలేమన్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ప్రముఖుల సంతాపం
ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఒక ఆర్థిక వేత్తగా, ఒక అధ్యాపడిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి పదేళ్లపాటు ప్రధానమంత్రిగా ఆయన దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పూడ్చలేనిదని అన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ క్రమంలో దేశ ప్రధాని మోదీతోపాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజ్ఞానం, వినయం, నిబద్ధతకు మన్మోహన్ సింగ్ ప్రతీకని కొనియాడారు. 1991లో ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చిన సంస్కరణల నుంచి ప్రధానమంత్రిగా దేశానికి వెలకట్టలేని సేవలందించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం
మన్మోహన్ మృతిపట్ల ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని, దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణల ఆద్యులలో ఆయన ఒకరని కొనియాడారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, యూజీసీ ఛైర్మన్‌గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన సంస్కరణల వల్ల మన ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కింది. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవని కొనియాడారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని కేసీఆర్ అన్నారు. ఈ మేరకు కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం
భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ మరణం పట్ల మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు. పదేళ్లపాటు దేశ ప్రధానిగా గొప్ప సేవలందించారని ప్రశంసించారు. ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలతో దేశ పురోభివృద్ధికి ఎంతగానో కృషిచేశారన్నారు. రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం ఛైర్మన్‌గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్‌గా.. ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్ గొప్ప మేధావి అని కొనియాడారు. దేశంలో పేదరికాన్ని పారదోలేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ అసమాన సేవలందించారని, ఆయన కలకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు. ఏ బాధ్యత నిర్వహించినా.. ప్రతి చోటా తనదైన ముద్ర కనబర్చారని గుర్తు చేశారు. ఆయన దార్శనికత ఎప్పటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. మన్మోహన్‌సింగ్ మృతితో దేశం ఒక మహా నాయకుడిని కోల్పోయిందన్నారు. ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
- Advertisement -