Friday, January 17, 2025

ఇందిరమ్మఇళ్ల సర్వేకు టెక్నికల్ ఎఫెక్ట్…

- Advertisement -

ఇందిరమ్మఇళ్ల సర్వేకు టెక్నికల్ ఎఫెక్ట్…

Technical effect of survey of Indiramma houses...

కరీంనగర్, జనవరి 4, (వాయిస్ టుడే)
ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం, నిలువ నీడలేని నిరుపేదలకు స్వంత ఇంటి కలను నిజం చేస్తాం’… ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హామీ. ఈ హామీని నిలబెట్టుకునేందుకు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక కోసం ముమ్మరంగా సర్వే చేపట్టింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా లబ్దిదారుల ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు.గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వర్క్ ప్రాబ్లం ఉండగా పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకున్న వారు అందుబాటులో లేకపోవడం అడ్రస్ సరిగా ఉండకపోవడంతో సర్వేకు ఆటంకంగా మారింది. డిసెంబర్ నెలాఖరులోగా సర్వే పూర్తి పూర్తిచేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకోగా సాంకేతిక సమస్యలతో జనవరి 3 వరకు 75% మాత్రమే సర్వే పూర్తయింది. గ్రామీణ ప్రాంతాల్లో కాస్త పర్వాలేదనుకున్నా పట్టణ ప్రాంతాల్లో మాత్రం 70 శాతం కూడా పూర్తి కాలేదు. లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సర్వే అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు.పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల లో నెట్ వర్క్ ప్రాబ్లాన్ని అధికమించేలా గ్రామ కార్యదర్శి హరికృష్ణ పొడవాటి కర్రకు సెల్ ఫోన్ కట్టి హాట్ స్పాట్ ఆన్ చేసి ట్యాబ్ కు కనెక్ట్ చేసుకుని యాప్ లో సర్వే డేటా పొందుపర్చి ఇప్పటి వరకు 90 శాతం సర్వే పూర్తి చేశారు. నెట్వర్క్ ప్రాబ్లం, సాంకేతిక సమస్యలతో రోజుకు 10 నుంచి 15 ఇళ్ల కంటే ఎక్కువ సర్వే చేయలేకపోతున్నామని పలు గ్రామల కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళ కోసం ప్రభుత్వానికి ప్రజాపాలన కార్యక్రమంలో 8054554 దరఖాస్తులు రాగ, ఇప్పటివరకు 5990889 సర్వే నిర్వహించారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 94 శాతం సర్వే పూర్తయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అతి తక్కువగా 16 శాతం దరఖాస్తులపైనే సర్వే జరిగింది. కరీంనగర్ నగరం పాలక సంస్థలో 56 శాతం సర్వే పూర్తయింది. హైదరాబాద్ మినహాయించి మిగతా 32 జిల్లాల్లో వారం పదిరోజుల్లో 100 శాతం సర్వే పూర్తయ్యే అవకాశాలున్నాయి. సర్వేను వేగవంతం చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే కరీంనగర్ జిల్లాలో 82 శాతం పూర్తయింది.‌ జిల్లా వ్యాప్తంగా 2,10,677 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు గ్రామాల్లో 88 శాతం, మున్సిపాలిటీలైన జమ్మికుంటలో 96.94 శాతం, హుజురాబాద్ లో 90.75 శాతం, చొప్పదండిలో 84.01 శాతం, కొత్తపల్లిలో 72.15 శాతం, కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 56 శాతం సర్వే పూర్తయినట్లు కలెక్టర్ పమెలా సత్పతి ప్రకటించారు. త్వరగా పూర్తిచేసేలా ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నామని తెలిపారు.మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్లు, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పొరపాట్లు జరగకుండా పక్కాగా వివరాలు నమోదు చేసి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. రోజు వారీగా పూర్తయిన సర్వే వివరాలను అందించాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ, పొరపాట్లకు తావులేకుండా దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్ మొబైల్ యాప్ లో జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని సూచించారు.సంక్రాంతి తర్వాత గ్రామసభలు ఏర్పాటు చేసి లబ్దిదారుల జాబితా తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో ఇందిరమ్మ కమిటీలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. అనంతరం గ్రామాల వారీగా లబ్దిదారుల ఎంపిక జాబితాలను జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు. కలెక్టర్లు పరిశీలించాక ఇన్ఛార్జి మంత్రులకు పంపిస్తారు. ఇన్ఛార్జి మంత్రి ఆమోదం తెలిపితే లబ్ధిదారుల ఖాతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే నగదును విడతల వారీగా జమచేస్తారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు.ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోకున్నా, ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఇంటి యాజమాన్ల వివరాలను సైతం సర్వే యాప్ లో పొందుపర్చాలని క్షేత్రస్థాయి అధికారులను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పాతకాలం నాటి ఇళ్లలో నివాసం ఉంటున్న వారు ఎవరైనా వాటి స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకు వస్తే… అలాంటి వారి వివరాలను కూడా పూర్తిస్థాయిలో సేకరించి సర్వే యాప్ లో పొందుపరుస్తున్నామని తెలిపారు. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్న దృష్ట్యా, దరఖాస్తుదారుల వివరాల నమోదులో పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు పాటిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్