హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భాజపా మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ లో విడుదల చేశారు. ‘మన మోదీ గ్యారంటీ.. భాజపా భరోసా’ పేరుతో మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలవుతాయన్నారు. ఛత్తీస్ ఘఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినా ఎలాంటి వివాదాలు లేవని, తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ సరిగా వ్యవహరించలేదని విమర్శించారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారన్నారు. తెలుగు రాష్ట్రాలకు 3 వందేభారత్ రైళ్లు కేటాయించామని గుర్తు చేశారు. కరోనా సమయంలో దేశమంతా ఉచితంగా రేషన్ ఇచ్చామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. కాళేశ్వరం రూపంలో నిధులన్నీ కేసీఆర్ కు చేరాయని అమిత్ షా ఆరోపించారు.

మేనిఫెస్టోలోని కీలక అంశాలివే..
• ధరణి స్థానంలో ‘మీ భూమి’ యాప్
• పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు.
• భారాస ప్రభుత్వం కుంభకోణాలపై విచారణకు కమిటీ ఏర్పాటు.
• గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు.
• ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా 1న వేతనాలు, పింఛన్లు.
• మత రిజర్వేషన్లు తొలగించి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెంపు.
• ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కమిటీ ఏర్పాటు.




