ప్రాణం పోయినా ఆ పార్టీల్లోకి వెళ్లను.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్..
బీజేపీ సస్పెండెడ్ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణం పోయినా తాను బీఆర్ఎస్ గానీ, కాంగ్రెస్ పార్టీలో గానీ చేరబోనని ప్రకటించారు. అంతే కాదు సెక్యూలర్ అని చెప్పుకునే ఏ పార్టీలోనూ తాను చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సస్పెన్షన్ ఎత్తివేతపై బీజేపీ నాయకత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని రాజాసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో గోషామహల్ నుంచే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, మళ్లీ జయకేతనం ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు రాజాసింగ్. ఒకవేళ బీజేపీ గనక తనకు టికెట్ ఇవ్వకుంటే కొన్నాళ్లు రాజకీయాలు పక్కన పెట్టి హిందూ రాజ్య స్థాపన కోసం కృషి చేస్తానని అన్నారు. దేశాన్ని హిందూ రాజ్యం చేయాలన్నదే తన లక్ష్యంగా ప్రకటించారు రాజాసింగ్. ఇదే సమయంలో బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు రాజాసింగ్. గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని దారుసలామ్‌లో ఎంపిక చేస్తారని విమర్శించారు.