జిల్లాలో ఆ నేతల చూపు బీజేపీ వైపు
The eyes of those leaders in the district are towards BJP
బిఆర్ ఎస్ అది నాయకత్వంపై సన్నగిళ్లుతున్న ఆశలు
– త్వరలో ఉమ్మడి కార్యచరణ అంటూ జోరుగా ప్రచారం…
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరున్నా వారికి లాభామే…
పెద్దపల్లి
ఓడలు బళ్ళు… బళ్ళు ఓడలవుతాయానే నానుడి వట్టిగా పుట్టలేదనిపిస్తున్నది బిఆరెఎస్ నాయకులను చూస్తుంటే… ఉద్యమం కోసం పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త తెలంగాణ రాష్ట్రం సిద్దించాక, పార్టీగా మారింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజల మధ్యలో పదేళ్లు పాలన చేసింది. అయితే ఉద్యమ సమయంలో దేనికోసం పోరాటం చేశారో నాయకులు పదవులు వచ్చిన తర్వాత పూర్తిగా మరిచిపోయారు. దీంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రదర్శించిన విజ్ఞతకు రాజకీయ మేధావులు విస్తు పోయారు. ప్రజలు తలుచుకుంటే దేనికైనా సిద్దమే అనే సంకేతాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి తెలియ జెప్పారు. ఇక అసలు విషయం లోకి వస్తే మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి రాజు ఎవరో బంటు ఎవరో తెలియని పరిస్థితి బీ ఆర్ ఎస్ పార్టీలో నెలకొంది. మొదట్లో పార్టీ నుండి పలువురు గెలిచిన ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్లినా, ఓడిపోయిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎటూ పాలు పోవడం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ కు గట్టి పోటీగా ఉన్న బీజేపీ పార్టీ తమకు ప్రత్యామ్నాయంగా చేసుకోవాలనే ఆలోచనలో మాజీలు ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతున్నది. అయితే ఇప్పటికే బిజిపిలో అంతర్గత పోరు కాస్త బయటకు పొక్కడంతో ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం. ఎలాగు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా బిఆరెఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలోని కీలక నేతలతో మంతనాలు కొనసాగుతున్నా యానే సంకేతాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే మున్ముందు ఏమైనా పదవులు దక్కే అవకాశాలు ఉంటాయని, ఆ తర్వాత పట్టించుకునే నాథుడు ఉండరని వారి కింది స్థాయి నాయకులు కూడా సూచిస్తుండటం గమనార్హం. ఇప్పటికి బిఆరెఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాలోచనలు సాగుతున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తూనే వున్నాయి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో బిఆరెఎస్ నేతలకు చుక్కెదురయ్యిందనే చెప్పాలి. దింతో మిగతా వారికి కూడా బలం చేకూరినట్లయ్యింది. గెలిచిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే సీఎంను కలవక తప్పని పరిస్థితి. పట్టుమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపంలా మారింది వీరి పరిస్థితి. ఇక తప్పని పరిస్థితుల్లో పార్టీ మారడమే శరణ్యం అనుకుంటున్నారు మరి కొంతమంది ఎమ్మెల్యేలు. ఇప్పటికే బిఆరెఎస్ అధినేతలపై పలు అవినీతి ఆరోపణలతో విచారణలు సాగుతున్నాయి. దీంతో పాలు పోని కింది స్థాయి నాయకులు, మాజీలు తమ తట్టాబుట్టా సదురుకునే ప్రయత్నంలో నిమగ్నమాయ్యారనే ప్రచారం జోరందుకున్నది… వీరి ప్రయత్నాలు ఏమేరకు సఫలం అవుతాయో వేచి చూడాలి.



