మహా జాతరలో తొలి ఘట్టం పూర్తి
ములుగు
గిరిజనుల ఆరాధ్య దైవం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరలో తొలి ఘట్టం పూర్తయ్యింది. నిన్న కన్నేపల్లి నుండి సారలమ్మ తల్లి గద్దేపైకి చేరుకుంది. సారలమ్మ రాక ఆద్యంతం కన్నులపండుగలా సాగింది. మూడు కిలో మీటర్ల ప్రయాణానికి మూడు గంటలకు పైగా సమయం పట్టింది. 8గంటలకు కన్నేపల్లి బయల్దేరిన అమ్మవారు 11.15 నిమిషాలకు మేడారం ప్రధాన దేవాలయ గద్దెలపైకి చేరుకున్నారు. సారాలమ్మ తల్లికి మంత్రి సీతక్క, కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలికారు.
ఆసియా ఖండంలోనే ఆదివాసీలు జరుపుకునే అతిపెద్ద పండగ మేడారం జాతర. మేడారం మహజాతర రెండేళ్లకు ఒకసారి జరిగే వనదేవతల మహోత్సవం. జాతర సమయంలో తెలంగాణ సహా దేశం నలుమూలల నుండి కోటి ముప్పై లక్షల మందికి పైగా భక్తులు సమ్మక్క సారలమ్మల చల్లని చూపు కోసం పరితపిస్తారు. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా మేడారం జాతర నిర్వహిస్తున్నారు. మహజాతర సందర్బంగా మొదటి రోజైనా బుదవారం రోజు సారాలమ్మను, రెండవ రోజైన గురువారం రోజు సమ్మక్కను గద్దెలపై ప్రతిష్టిస్తారు. మూడవ రోజు అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చి, నాల్గవ రోజు తిరిగి వనంలోకి వెళ్తారు.
కోయ గిరిజనుల ఉనికికోసం పోరాటం చేసి ప్రాణాలర్పించిన సమ్మక్క-సారలమ్మలను వనదేవతలుగా కొలుస్తూ జరుపుకునే పండగే మేడారం మహా జాతర. ములుగు జిల్లా తడ్వాయి మండలంలోని మేడారంలో జరిగే ఈ జాతర ప్రపంచం దృష్టి ని ఆకర్షస్తుంది. భక్తి పారవశ్యంతో, పునకాలతో ఉగిపోతు కోటిపైగా భక్తులు సమ్మక్క సారాలమ్మ తల్లులకు తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఒకప్పుడు గిరిజన జాతరగా వున్న మేడారం జాతర నేడు సకల జనుల జాతరగా మారిపోయింది. కులాలు మతాలు చిన్న పెద్ద అడా మగ తేడా లేకుండా అన్ని వర్గాల వారు తల్లులను దర్శించుకొని మొక్కులను చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలోనే జాతరను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. మేడారం మహా జాతరకు నెల రోజుల ముందు నుండే అమ్మవారి సన్నిధికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నటున్నారు భక్తులు. మహా జాతరలో మొదటి రోజున సారాలమ్మ తల్లిని గిరిజన సంప్రదాయం పద్దతిలో పూజలు నిర్వహించి మేడారంలోని గద్దె మీద ప్రతిష్టించారు.
మహాజాతర జరిగే నాలుగు రోజులు ఎంతో ప్రత్యేకమైనవి. ఒక్కో రోజు ఒక్కో విధానంలో వనదేవతలు, వారితోపాటు సమ్మక్క సారాలమ్మల కుటుంబ సభ్యులు గద్దెల వద్దకు చేరుకొంటారు. కుటుంబ సభ్యులంతా గద్దెలపైకి చేరుకున్నాక మేడారం ప్రాంగణం శక్తి పీఠంలా మారి భక్తుల కొంగు బంగారంలా మారిపోతుంది. నిన్న, మొదటి రోజు తంతులో భాగంగా సారాలమ్మను కన్నెపల్లి గ్రామం నుండి మేడారం గద్దెకు తరలించారు. కన్నెపల్లి గ్రామం మేడారం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాయంత్రం 8గంటలకు కాక వంశీయులు, భారీ పోలీస్ బద్రత మధ్య బయల్దేరిన సారాలమ్మ మేడారం గద్దెలపైకి 11గంటల 15 నిమిషాలకు చేరుకుంది. సారలమ్మతో పాటు, ఆమె భర్త గోవిందరాజులు, తండ్రి పగిడిద్దరాజులు కూడా మేడారం గద్దెలపైకి చేరుకున్నారు.
ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నాలుగు రోజుల పండుగలో తొలిరోజు బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారంలోని గద్దెపై కొలువుదీరింది. పగిడిద్దరాజు, గోవిందరాజులు సారలమ్మతోనే గద్దెలపైకి చేరారు. కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం కాక వంశానికి చెందిన పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం సుమారు 8 గంటలకు గుడి నుంచి వెదురుబుట్టలో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు. జంపన్నవాగులో నుంచి కాలినడకన సమ్మక్క గుడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులుతో కలిసి వడ్డెలు ముగ్గురి రూపాలను రాత్రి 11గంటల 15 నిమిషాలకు మేడారం గద్దెలపై చేర్చారు. కన్నెపల్లి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మ వస్తున్న వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు పోటీపడ్డారు. సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై నుంచి దాటుకుంటూ వెళ్లారు. సారలమ్మ రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ముబూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం మార్మోగింది. కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ నేరుగా గద్దెలపైకి వెళ్లకుండా మేడారంలోని సమ్మక్క పూజా మందిరానికి చేరుకున్నది. అప్పటికే గోవిందరాజు, పగిడిద్దరాజు అక్కడికి చేరుకొన్నారు. పూజారులందరూ సంయుక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కట్టువేసిన అనంతరం అందరూ కలిసి సారలమ్మ గద్దెపైకి చేరుకొని తల్లిని గద్దెపై ప్రతిష్ఠించారు.
మహజాతరలో నేడు రెండవ రోజు ప్రధాన ఘట్టం జరుగుతుంది. జాతరలో ప్రధాన దేవతైన సమ్మక్క గద్దెపైకి చేరుకుంటుంది. మేడారం గద్దెల ప్రాంగణానికి సంప్రదాయ పద్దతిలో దేవతలను తీసుకువస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులుగా మేడారం జాతరకు నెలరోజుల ముందు నుండే పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటగా పూజారులు గుడిమెలిగడం, వనం నిర్వహించి తేవడం, సిద్దబోయిన వారి ఇంటినుండి హడారాలు తీసుకొని గుడికి వెళ్లి పూజలు చేసి గిరిజన సంప్రదాయం ప్రకారం తల్లులను గద్దెలపైకి తీసుకెళ్తారు. కన్నెపల్లి నుండి నిన్న సారాలమ్మను గద్దెపైకి తీసుకురాగా, నేడు చిలుకల గుట్టనుండి ప్రధాన దేవత సమ్మక్క తల్లిని గద్దెలపైకి తీసుకురానున్నారు. సమ్మక్క పూజారులు చిలుకలగుట్ట అడవిలోకి వెళ్లి సమ్మక్క తల్లికి రహస్య పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడినుండి కుంకుమ భరిని రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని గుట్ట కిందికి తీసుకొస్తారు. ఈ సందర్బంగా జిల్లా అధికారుల సమక్షంలో స్థానిక ఎస్పీ శబరిష్ గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్క రాకను ఆహ్వానిస్తారు.
వాయిస్ ఓవర్:…
మేడారం జాతరకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి, ఆ తర్వాత అమ్మవార్ల సన్నిధికి చేరుకొని తమ మొక్కులు అప్పగిస్తున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు మేడారనికి చేరుకుని జంపన్న వాగు వద్దకు చేరుకుంటుండడంతో జంపన్న వాగు పరిసర ప్రాంతాలు పూర్తిగా జనసంద్రంలా మారిపోయాయి. భక్తిశ్రద్ధలతో జంపన్న వాగులో స్నానాలు చేసిన అనంతరం అమ్మవార్లకు మొక్కులు అప్పజెప్పి మళ్లీ తిరిగి జంపన్న వాగులో జలకాలాడుతూ యువత ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ,స్నేహితులతో కలిసి జంపన్న వాగులో ఆటలు ఆడుతూ, కేరింతలు కొడుతూ ఉత్సాహంగా గడుపుతున్నారు భక్తులు.
తెలంగాణా కుంభమేళా మేడారం మహాజాతరకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా రానున్నారు. అందుకోసం అధికారులు అన్నీఏర్పాట్లు పూర్తి చేశారు. నేటితో సమ్మక్క సారాలమ్మలు ఇద్దరూ గద్దెలపైకి చేరి అశేష భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నారు. ఇద్దరు తల్లులు గద్దెలపైకి చేరుకోవడంతో మేడారం ప్రాంగణం శక్తి పీఠంలా మారుతుంది. ఇక ఇద్దరు తల్లులను చూసి తరించడానికి భారీగా భక్తులు తరలివస్తారు. ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. కేంద్ర మంత్రి రాక నేపథ్యంలో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.