9.4 C
New York
Saturday, April 13, 2024

కరీంనగరంలో చిచ్చురేపిన పంచాయితీ…

- Advertisement -

కరీంనగరంలో చిచ్చురేపిన పంచాయితీ…
కరీంనగర్, మార్చి 23
కరీంనగర్ కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు సాగుతుందా?.. ఇద్దరు మంత్రుల మధ్య వైరం ముదరడానికి నామినేటెడ్ పోస్టులు ఆజ్యం పోశాయా?.. అంతర్గత విభేదాలు, గ్రూప్ రాజకీయాలు పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నాయా?.. అంటే అవుననే సమాధానం వస్తుంది. దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లో పదవుల పంచాయితీ, ఆధిపత్యపోరు ఎంపీ ఎన్నికలవేళ కలకలం సృష్టిస్తుంది. నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్లు నేతలు వ్యవహరించడంతో పార్టీ పెద్దలకు పిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పదవుల పంచాయతీ పెద్దల దృష్టికి వెళ్ళడంతో ప్రకటించిన నామినేటెడ్ పదవులను హోల్డ్ లో పెట్టారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలు కలకలం సృష్టిస్తున్నాయి. అంతా ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. అంతర్గతంగా నేతలు రగిలిపోతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల మద్య గ్రూప్ రాజకీయాలు.. అంతర్గత విభేదాలు పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీ మంత్రుల మద్య కోల్డ్ వార్ ను మరింత పెంచినట్లైంది. పదవుల పంచాయితీ పార్టీ పెద్దల దృష్టికితీసుకెళ్ళి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకునే స్థాయికి చేరింది. పార్లమెంట్ ఎన్నికల వేళ బిఆర్ఎస్, బిజేపి అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ముమ్మరం చేయగా కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ఎంపిక ఊగిసలాడుతు పదవుల కోసం పంచాయితీ పెట్టుకుని పరువు తీసుకునే పరిస్థితి ఏర్పడింది.దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీని మరో పదేళ్ళ పాటు పదిలంగా నిలపడానికి బదులు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కోసం శ్రమించిన వారిలో ముఖ్యులకు కార్పొరేషన్ పదవులను కట్టబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఆ మేరకు జిల్లాల వారీగా జాబితాలను సిద్ధం చేసి ఏఐసీసీకి ప్రతిపాదించారు. ప్రతిపాదన ఆధారంగా ఉమ్మడి జిల్లాలో నలుగురికి దక్కాయి. మహిళా కమీషన్ చైర్ పర్సన్ గా మహిళా నాయకురాలు నేరెళ్ళ శారద, సుడా చైర్మన్ గా సిటి కాంగ్రెస్ అద్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా మంథని నియోజకవర్గానికి చెందిన అయిత ప్రకాశ్ రెడ్డి, పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం కు చెందిన జనక్ ప్రసాద్ కు మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ గా నియమించారు. అందులో జనక్ ప్రసాద్, ప్రకాశ్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు శారద, నరేందర్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందినవారు. అయితే ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ చార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోకుండా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జి మంత్రి శ్రీధర్ బాబు కు అనుకూలంగా వ్యవహరించే వారికే పదవులు దక్కాయని పొన్నం అనుచరులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.హుస్నాబాద్ నుంచి అసెంబ్లీ కి ఎన్నికైన మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కాంగ్రెస్ వ్యవహారాలను శాసిస్తున్నా మాటమాత్రం సమాచారం లేకుండా సుడా చైర్మన్ పదవిని భర్తీ చేయడాన్ని పొన్నం అవమానంగా భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పదవి దక్కగానే నరేందర్ రెడ్డి మంత్రి పొన్నం నివాసానికి వెళ్ళి ధన్యవాదాలు తెలిపే క్రమంలో శాలువ కప్పడానికి ప్రయత్నించగా పొన్నం నిరాకరించినట్లు తెలిసింది. పొన్నం తన అసంతృప్తిని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించినట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి దీపా దాస్ మున్షీ తో పాటు సీఎం రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పొన్నం మాట్లాడి తన నిరసనను వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తన స్వంత జిల్లాకు సంబంధించి ఇతర బాధ్యతలను తనకు అప్పగించి తీరా నామినేటెడ్ పదవుల విషయంలో తనకు సమాచారం ఇవ్వకపోవడాన్ని ఏ విధంగా చూడాలంటూ పొన్నం అ‌సహనంతో ఉన్నారు. ఇదే సమయంలో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు నేతలు మంత్రి పొన్నం దృష్టికి తీసుకెళ్ళి కరీంనగర్ లో శ్రీదర్ బాబు జోక్యం ఏంటనే విధంగా పార్టీ పెద్దలకు పిర్యాదు చేశారు. పార్టీ లో ఏళ్ళతరబడి కష్టపడి పని చేస్తున్నా, నామినేటెడ్ పదవుల ఎంపికలో అన్యాయం చేశారని ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుడా చైర్మన్ పదవి నరేందర్ రెడ్డి కి కట్టబెట్టడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న నియోజకవర్గ ఇన్చార్జి పురమల్ల శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజనీ కుమార్ తో కలిసి పార్టీ పెద్దలకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ నరేందర్ రెడ్డి తనను డబ్బులు డిమాండ్ చేశారని.. తన ఓటమికి తీవ్ర ప్రయత్నం చేశారంటూ పురుమల్ల శ్రీనివాస్ ఆరోపిస్తూ సుడా చైర్మన్ పదవి కట్టబెట్టవద్దంటూ కోరినట్లు సమాచారం. పురుమల్ల వాదనలు విన్న పార్టీ పెద్దలు ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరికివారు తామే పార్టీ కోసం సర్వం ధారపోశామని గొప్పలు చెప్పుకుంటున్నా అసలు ఉమ్మడి జిల్లా కేంద్రంలో పార్టీ పరిస్థితి ఏమిటన్న దానిపై ఎవరూ దృష్టి సారించడం లేదు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత క్రమేపీ నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంఖ్య వేళ్ళ మీద లెక్కించేలా మారింది. ఒక్కో పదవిని కోల్పోతూ పార్టీకి కనీస అడ్రస్ లేకుండాపోయింది. మున్సిపల్ చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం కరువైంది. చోటామోటా పదవులు కూడా లేని పరిస్థితుల్లో ఈసారైనా కాంగ్రెస్ హవాలో కరీంనగర్ లో జెండా ఎగురవేయాలని సీనియర్ కాంగ్రెస్ వాదులు బలంగా కోరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయాన పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ కు మకాం మార్చితే కరీంనగర్ లో రాహుల్ గాంధీ రోడ్ షోకు సంబంధించి కనీస ఏర్పాట్లు చేసే వారు లేకుండా పోయారు. చివరకు పొన్నం హుస్నాబాద్ నుంచి కరీంనగర్ కు చేరుకొని నరేందర్ రెడ్డితో కలిసి కసరత్తు చేస్తే తప్ప కరీంనగర్ లో రాహుల్ గాంధీ రోడ్ షో ముందుకు సాగలేకపోయింది. పొన్నం లేకపోవడంతో ప్రత్యామ్నయంగా‌ పార్టీ అగ్రనాయకత్వం ఏరికోరి తీసుకువచ్చిన అభ్యర్థి నామినేషన్ రోజు నుంచే చేతులెత్తేశారు. దీంతో డిపాజిట్ కూడా అతికష్టమ్మీదనే దక్కించుకోగలిగారు. తీరా ఇప్పుడు తన ఓటమికి పార్టీ నేతలే కారణమంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పురుమల్ల స్వయంగా ఫిర్యాదులకు పాల్పడుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కనుచూపు మేరలో కూడా ఏ మాత్రం పట్టు లేని బీజేపీ కరీంనగర్ లో ఓడిగెలిచినంత పని చేయగా.. కరీంనగర్ కు కుడి, ఎడమ వైపు నియోజకవర్గాల్లో విజయం సాధించింది.కరీంనగర్ లో మాత్రం మూడోస్థానంలో నిలిచి డిపాజిట్ కు కొంచెం చేరువ కావడం స్థానిక కాంగ్రెస్ నేతల పనితీరుకు అద్దం పడుతోంది. తీరా అధికారంలోకి రాగానే కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టడానికి తామే కారణమంటూ నేతలు తిరిగి ప్రచారం చేసుకుంటున్న వైనంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. నేతల మధ్య ఆధిపత్య ధోరణి కారణంగానే కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ తిరోగమనంలో పయనిస్తోందంటూ పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం పదవులు వచ్చిన వర్గం ఆనందంగా, పదవులు లభించని వర్గం ఆవేదనతో ఉండడంతో పరస్పర విమర్శల నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం హోల్డ్ లో పెట్టింది. ఎంపీ ఎన్నికలు పూర్తయ్యాకే నామినేటెడ్ పదవులపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!