హైదరాబాద్, ఆగస్టు : ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, దాటాక బోడి మల్లన్న అన్నట్టు ప్రతిపక్షాలు చేస్తాయని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మంచి పనులు చేశారని తెలిపారు. ఇబ్రహీంపట్నంపై తనకు ప్రత్యేక ప్రేమ ఉందని, అందుకే అభివృద్ది చేశారని అన్నారు. 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు ప్రారంభించి, విజయవంతంగా అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు.
తల్లులు బలంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్స్ ప్రారంభించామన్నారు. నాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30 శాతం అయితే, నేడు 72.8 శాతం అవుతున్నాయని అన్నారు. బిడ్డ కడుపులో పడితే న్యూట్రిషన్ కిట్స్, బిడ్డ పుడితే కేసీఆర్ కిట్స్ ఇస్తున్నామని గుర్తు చేశారు. మహిళల సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు. రాష్ట్రంలో 200 క్లినిక్స్ ఏర్పాటు చేసి, ప్రతి మంగళవారం మహిళల కోసమే పరీక్షలు, మందులు, చికిత్స అందిస్తున్నారని అన్నారు. తల్లికి పాలు, కోడి గుడ్డుతో భోజనం పెట్టే అరోగ్య లక్ష్మి, ఉచితంగా గర్భిణులను ఆసుపత్రికి తీసుకువెళ్ళే అమ్మ ఒడి వాహనాలు ప్రారంభించామని గుర్తు చేశారు.మహిళలకు తాగు నీటి కష్టాలు లేకుండా చేశారు సీఎం కేసీఆర్. నాడు నీళ్ళ కోసం కొట్లాట.. కనీళ్ళ తండ్లాట అన్నారు. వడ్డీలేని రుణాలు, అభయహస్తం, బ్యాంకు లింకేజి పెంచామన్నారు. వీఏవోలను నాటి ప్రభుత్వాలు గుర్తించలేదన్నారు. రెన్యువల్ ఆటోమేటిక్ చేయాలని, ఇన్సూరెన్స్ చేయాలని, వేతనం పెంచాలనే కోరికలను వారంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వీరితో పాటు ఆర్పీల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించాలని ఆదేశించారు. వారంలో ఉత్తర్వులు ఇస్తామని మంత్రి తెలిపారు. రుణమాఫీ కోసం ఒకేసారి 20 వేల కోట్ల రూపాయలు దాకా అప్పు మాఫీ చేసే కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఆ తర్వాత వడ్డీ లేని రుణాలు కూడా మంజూరు చేస్తామన్నారు. ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తున్న ఘటన సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. ఆ చెక్కులు కూడా తల్లికి ఇవ్వాలని ఆదేశించారు. గృహలక్ష్మి ద్వారా ఇచ్చే డబ్బులు కూడా ఇంటి యజమానురాలు పేరు మీద ఇవ్వాలని ఆదేశించారు.
ఏ కార్యక్రమం చేసినా మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు సీఎం కేసీఆర్ అని అన్నారు. మహిళలకు రూపాయి ఇస్తే, ఇంటికి సద్వినియోగం చేస్తారని సీఎంకి మీపై నమ్మకమని తెలిపారు. నాడు 200 ఉన్న పింఛను ఉంటే 2000 చేసింది కేసీఆర్ అన్నారు.కళ్యాణ లక్ష్మి 75 వేల నుండి లక్ష చేశారని, రైతు రుణ మాఫీ అన్నారు, చేసి చూపారని.. కొందరు ఎన్నికలు రాగానే అన్ని ఇస్తాం అంటారని తెలిపారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, దాటాక బోడి మల్లన్న అన్నట్టు ప్రతిపక్షాలు చేస్తాయని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు కర్ణాటకలో గెలిచారు. అక్కడ రైతులకు 8 గంటల కరెంట్ రావడం లేదని తెలిపారు. బెంగళూర్ లో నాలుగు గంటలే ఇస్తున్నరు, పరిశ్రమలకు కరెంటు కోత ఉందని అన్నారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంట్ పరిస్థితి అలా ఉంటే, ఇక్కడి కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు చాలు అంటున్నాడని తెలిపారు. మూడు గంటలు ఇస్తే, మూడు ఎకరాలు పారుతాయి అంటున్నడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డాడు. బీజేపీ వాళ్లు మీటర్లు పెట్టాలి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్లు మూడు గంటల కరెంట్ చాలు అంటున్నాడు, కేసీఆర్ మాత్రం మూడు పంటలు పండియ్యాలి అంటున్నడు. ఎవరు కావాలో ప్రజలు ఆలోచించాలని తెలిపారు. రైతుల పాలిట నల్ల చట్టాలు తెచ్చి బిజెపి వాళ్లు పాపంగా మారితే, మూడు గంటల కరెంటు చాలు అంటూ కాంగ్రెస్ వాళ్లు శాపంగా మారాయని తెలిపారు. దీపం లాంటి కెసిఆర్ ఉండగా, పాపం లాంటి బీజేపీ, శాపం లాంటి కాంగ్రెస్ ఎందుకు? అని ప్రశ్నించారు.