కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై వైఎస్ షర్మిల ఫోకస్.. నేడు, రేపు కీలక భేటీలు
కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారితో షర్మిల సంప్రదింపులు
అభ్యర్థులపై అవగాహనకు వచ్చాక అధిష్ఠానానికి జాబితాను పంపించనున్న ఏపీసీసీ చీఫ్
అధిష్ఠానం ఆమోదం తర్వాత అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపికపై ఏపీసీసీ దృష్టిపెట్టింది. ఇప్పటికే అధికార వైఎస్సార్‌సీపీ, విపక్ష టీడీపీ-జనసేన కూటమి కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు హస్తం పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు, రేపు భేటీలు నిర్వహించనున్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో దరఖాస్తుదారులతో సంప్రదింపులు జరపనున్నారు.
టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారితో ముఖాముఖీ మాట్లాడిన తర్వాత టికెట్లపై షర్మిల ప్రాథమిక అంచనాకు వచ్చే అవకాశాలున్నాయి. అనంతరం ఆ జాబితాను ఏఐసీసీ ఆమోదానికి పంపనున్నారని తెలుస్తోంది. అధిష్ఠానం ఆమోదం తర్వాత అభ్యర్థులను ప్రకటించనున్నారు. కాగా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 1,100 దరఖాస్తులు వచ్చాయి. ఈరోజు నిర్వహించనున్న ముఖాముఖీలో భాగంగా నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారితో మాట్లాడనున్నారు. ఇక రేపు శ్రీకాకుళం, అరకు, ఒంగోలు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని దరఖాస్తుదారులతో చర్చించనున్నారు