రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్
రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసిపిలు , ఎస్ఐలు, ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్ టీం మరియు ఇతర సిబ్బందికి ఎన్నికల నిబంధనల మీద ఆన్లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించిన కమిషనర్ త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని నామినేషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లను మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ డిఎస్ చౌహన్ ఐపిఎస్ గారు రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసిపిలు, ఎస్ హెచ్ఓ లు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్ టీం మరియు ఇతర సిబ్బందికి ఆన్లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణ బందోబస్తు సమయంలో పాటించవలసిన నిబంధనల మీద సిబ్బందికి గల పరిజ్ఞానాన్ని పరీక్షించడంతో పాటు నిబంధనల మీద అవగాహన కల్పించారు.
ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ… ఎన్నికల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను తమ కింది స్థాయి సిబ్బందికి అందించాలని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే కిందిస్థాయి సిబ్బందికి కూడా ఎన్నికల నిబంధనల మీద పరిజ్ఞానాన్ని, అవగాహనను కల్పించడానికి సిబ్బందితో అంతర్గత శిక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కమిషనర్ పేర్కొన్నారు. రాచకొండ పరిధిలో అవసరమైన అన్ని చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, అక్రమంగా తరలిస్తున్న డబ్బును పట్టుకోవడానికి పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సరైన వివరాలు లేకుండా తరలిస్తున్న పరిమితికి మించిన అక్రమ నగదును ఎక్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారి సమక్షంలో సీజ్ చేయాలని సూచించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్ టీం లు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.