“పెద్ది” మూవీ ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులకు కన్నుల పండుగలా ఉంటుంది: డీవోపీ రత్నవేలు
“Every frame of the movie ‘Peddi’ is a visual feast for the audience: DOP Rathnavelu”
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డీవోపీ రత్నవేలు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఈ కథ చెప్పినప్పుడు మీ ఆలోచనలు, విజువలైజేషన్ ఎలా ఉండింది?
-బుచ్చిబాబు గారు ఈ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. ఇది దాదాపు 40 ఏళ్ల క్రితం విజయనగరంలో జరిగే కథ అని చెప్పారు. ఇప్పుడు విజయనగరం పూర్తిగా మోడ్రన్ అయిపోయింది. కానీ ఒకప్పటి విజయనగరానికి ప్రేక్షకులను తీసుకెళ్లాలి. అదంతా ఒక ఇమాజినేషన్. రిఫరెన్స్ కోసం కొన్ని ఇమేజెస్ తీసుకుని, ‘పెద్ది’ కథను ఎలా చెప్పాలి, విజువల్‌గా ఎంత అందంగా క్రియేట్ చేయాలనే దానిపై చాలా పకడ్బందీగా వర్క్ చేశాం.
-క్లాక్ టవర్, వీధులు, షుగర్ ఫ్యాక్టరీ ఇలా ఒక్కో అంశాన్ని వరల్డ్ బిల్డింగ్ చేస్తూ వెళ్లాం. కొండ ప్రాంతాలు, అక్కడి ప్రజలు, వారి లైఫ్ స్టయిల్ ఇలా ప్రతిదీ చాలా ఆర్గానిక్‌గా డిజైన్ చేయడం జరిగింది.
– ‘రంగస్థలం’లో గోల్డెన్ బ్రౌన్ టోన్ వాడాను. అది చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పటికీ చాలా మంది సినిమాటోగ్రాఫర్లు దాన్ని పీరియడ్ సినిమాలకు రిఫరెన్స్‌గా తీసుకుంటారు. పెద్ది సినిమాకి వస్తే 40 సంవత్సరాల క్రితం విజయనగరంలో ప్రజల ఒక కలర్ ఎక్స్పీరియన్స్ చేసి వుంటారు. అలాంటి ఫీలింగ్‌ను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించాం. ప్రేక్షకులు మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు కనెక్ట్ అయ్యేలా ఒక మూడ్ క్రియేట్ చేశాం.
-కోవిడ్ తర్వాత సినిమా మారిపోయింది. ఇప్పుడు ప్రేక్షకులు రియలిజాన్ని కోరుకుంటున్నారు. అందుకే రియలిస్టిక్ ఫీలింగ్ ఉన్న విజువల్స్‌ను క్రియేట్ చేశాం. ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది సినిమాటోగ్రఫీని ప్రశంసించడం ఆనందంగా ఉంది.
-బుచ్చిబాబు గారు ప్రతి ఎడిటింగ్ సెషన్ తర్వాత “రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు, రత్నవేలు గారికి నేషనల్ అవార్డు” అని చెప్పేవారు. మాకు ఆ ఎక్స్సైట్మెంట్ వుంది. ఒక కథ రాసిన తర్వాత అది 60 శాతం స్క్రీన్ మీదకు వస్తే సూపర్ హిట్ అంటారు. కానీ బుచ్చిబాబు గారు 200 శాతం స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు. ఆయన ఆనందం చూస్తుంటే కెమెరామెన్‌గా నాకు చాలా సంతోషంగా అనిపించింది.
-నేను ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అయ్యింది. ఏడాదికి ఒక సినిమానే చేస్తాను. ఒక సినిమా కమిట్ అయితే అదే సినిమా పూర్తయ్యే వరకు చేస్తాను. మధ్యలో చాలా పెద్ద సినిమాలు వచ్చినా చేయలేదు. నాకు ఈ కథ చాలా నచ్చింది. చరణ్ గారు బుచ్చిబాబు గారు అందరం ఈ సినిమాకి ప్రాణం పెట్టి పని చేశాం.
-‘రోబో’ పూర్తయిన తర్వాత నేను తెలుగు పరిశ్రమలోకి వచ్చాను. అప్పటికే బాలీవుడ్ నుంచి చాలా పెద్ద ఆఫర్లు వచ్చినప్పటికీ, సుకుమార్ గారితో మంచి కాంబినేషన్ కుదిరింది. అప్పటి నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నాను.
ఈ సినిమాలో మీకు మోస్ట్ చాలెంజింగ్ అనిపించిన ఎలిమెంట్స్ ఏమిటి?
-ప్రతి సినిమాలో ఒక ఛాలెంజ్ ఉంటుంది. ‘రోబో’లో ప్యాచ్‌వర్క్ కూడా ఒక ఛాలెంజ్. ‘సైరా నరసింహారెడ్డి’ ఇంకా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే అది 18వ శతాబ్దంలో జరిగిన కథ. దానికి స్పష్టమైన రిఫరెన్స్ పాయింట్లు ఉండవు.
-‘పెద్ది’లో నాకు అత్యంత కాంప్లికేటెడ్‌గా అనిపించింది క్రికెట్ మ్యాచ్. ఇది స్పోర్ట్స్ బేస్డ్ సినిమా. కెమెరామెన్తో పాటు మొత్తం టీమ్ చాలా అవేర్‌గా ఉండాలి. సినిమాలో వచ్చే సెకండ్ క్రికెట్ మ్యాచ్ చాలా కీలకం. అది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, కథలోనే ఒక పెద్ద మలుపు. ఆ మ్యాచ్‌ను రాత్రిపూట షూట్ చేద్దామని నేను బుచ్చిబాబు గారికి సూచించాను. 80లలో ఫ్లడ్‌లైట్ మ్యాచ్‌లు జరిగేవి. ఆ మూడ్ కోసం నైట్ షూట్ అయితే బాగుంటుందని అనిపించింది. ఆయనకు ఆ ఆలోచన నచ్చింది. షూటింగ్ తర్వాత రామ్ చరణ్ గారు వచ్చి “అద్భుతమైన ఆలోచన, దీంతో సినిమా మరో స్థాయికి వెళ్లింది” అని చెప్పారు. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
-స్క్రీన్‌పై చూసినప్పుడు అది కేవలం క్రికెట్ మ్యాచ్‌లా అనిపించదు. రెండు జట్ల మధ్య యుద్ధంలా అనిపిస్తుంది. చరణ్ గారు అందులో ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చరణ్ గారు ఇందులో చాలా సబ్టిల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా చాలా అద్భుతంగా క్యాప్చర్ చేయడం జరిగింది. ఆయన ఇంటెన్సిటీని ప్రేక్షకులు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు.
-ఇందులో కుస్తీ పోటీలు కూడా మరో పెద్ద ఛాలెంజ్. ఒక గెటప్ అనుకున్న తర్వాత కాస్ట్యూమ్స్, బాడీ మార్చుకుంటే సరిపోతుంది. కానీ ఇందులో రామ్ చరణ్ గారు కుస్తీ విషయానికి వచ్చేసరికి తన బాడీలోని ప్రతి మజిల్పై వర్క్ చేశారు. ప్రతి మజిల్‌ను డెవలప్ చేసి, ఒక రియల్ పహిల్వాన్లా కనిపించారు. మీరు టీజర్, ట్రైలర్లో చూస్తే ఆయన బాడీలోని ప్రతి మజిల్ కూడా చాలా డీటైల్‌గా కనిపిస్తుంది.
– హనుతుడి రిఫరెన్స్‌తో వచ్చే ఒక సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్‌లో ప్రత్యేకమైన లైటింగ్ డిజైన్ చేశాను. అది మీరు థియేటర్లో చూసినప్పుడు గూస్బంప్స్ వస్తాయి. అందులో రామ్ చరణ్‌లో ఒక హనుమంతుడిని ఫీల్ అవుతారు.
-రంగస్థలంకు పెద్దికి రామ్ చరణ్‌లో నటుడిగా ఎలాంటి గ్రోత్ చూశారు?
-‘పెద్ది’లో రామ్ చరణ్ గారి నట విశ్వరూపం చూస్తారు. అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ‘రంగస్థలం’లో చిట్టిబాబు పాత్రను చూసినప్పుడు ఆయన ఎక్కడా కూడా ఆ పాత్రను దాటి బయటకు రారు. ‘పెద్ది’ పాత్ర విషయానికి వస్తే, చిట్టిబాబుకి, పెద్దికి ఎమోషనల్‌గా చాలా తేడా ఉంటుంది. రెండు పాత్రలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి.
-ఈ సినిమాలో చరణ్ గారు మరో స్థాయికి వెళ్లారు. ఆయనకు అనుకున్నది వచ్చేవరకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. టేక్ బాగుందని చెప్పినా, ఇంకా మెరుగ్గా రావాలని మళ్లీ ప్రయత్నిస్తారు. ఈ పాత్ర కోసం ఆయన చేసిన ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా అద్భుతం.
-ఈ సినిమా క్లైమాక్స్ కూడా చాలా చాలెంజింగ్. ఇప్పుడే దాని గురించి ఎక్కువ చెప్పకూడదు. అది ప్రేక్షకులకు కన్నుల పండుగలా ఉంటుంది. విజువల్ గ్రాండియర్‌తో పాటు ఎమోషనల్ హై కూడా ఉంటుంది. చివరి 30 నిమిషాలు సినిమా ప్రేక్షకులని కదిలిస్తుంది. చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు.
-ఈ పాత్ర కోసం రామ్ చరణ్ గారు చేసిన ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతం. ఫిజికల్ గా ఆయన చేసిన హార్డ్ వర్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే హెయిర్ స్టైల్ దగ్గర నుంచి బీడీ తాగే విధానం వరకు ప్రతిదీ పాత్రకు తగ్గట్టుగానే ఉంటుంది.
బుచ్చిబాబు గారి గురించి…?
బుచ్చిబాబు గారు చాలా అద్భుతమైన కథ రాశారు. ఆయన రైటింగ్ చాలా బాగుంటుంది. తనకు ఏమి కావాలో చాలా క్లియర్‌గా తెలుసు. అలాగే దాన్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు. క్యారెక్టర్ సెలెక్షన్, పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి.
-ఇందులో ఢిల్లీలో చిత్రీకరించిన పోర్షన్ నాకు చాలా ఫేవరెట్. అక్కడ నేను లైట్ లేకుండా షూట్ చేశాను. దాని కోసం ఫిల్మ్ నెగటివ్‌ను వాడాం. దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఫిల్మ్ నెగటివ్‌ను ఉపయోగించాను. ఇప్పుడు ఉన్న డిజిటల్ కెమెరాలు అద్భుతమైన ఔట్పుట్ ఇస్తున్నప్పటికీ, ఒక రియల్ ఫీల్ కోసం ఫిల్మ్ నెగటివ్ ఉపయోగించడం జరిగింది. అది జర్నీలో వున్న రియలిజం చూపించడానికి అది ఉయోగించాము.
-శ్రీలంకలో షూటింగ్ కూడా స్పెషల్ ఎక్స్ పీరియన్స్. అక్కడో వాటర్‌ఫాల్ సీక్వెన్స్ ఉంది. అక్కడ ఇంతకు ముందు ఎవరూ షూట్ చేయలేదు. అది ఒక రైల్వే ట్రాక్ దగ్గర ఉంటుంది. మేము చాలా కష్టపడి ఆ ప్రదేశానికి వెళ్లాం. అక్కడ చూసిన రైల్వే ట్రాక్ మమ్మల్ని చాలా ఎగ్జైట్ చేసింది. అలాగే అక్కడ టన్నెల్ కూడా వుంది. ఇందులో ట్రావెలింగ్ చేసే సీక్వెన్స్‌లు, కొండ ప్రాంతాలు, వాటర్‌ఫాల్స్, టన్నెల్స్ అన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి.
మీ వర్కింగ్ స్టైల్ గురించి…
-నేను చేసే ప్రతి సినిమాకి ప్రీ-ప్రొడక్షన్ నుంచి పోస్ట్-ప్రొడక్షన్ వరకు ఉంటాను. డీఐలో కూడా కూర్చుంటాను. ఇలాంటి పెద్ద సినిమాలు ఐమాక్స్‌లో విడుదలైతే ప్రేక్షకులు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. అమెరికా, ముంబై, పుణే వంటి ప్రాంతాల్లో ఐమాక్స్ స్క్రీన్లు ఉన్నాయి. ఆ స్క్రీన్లలో ప్రేక్షకులు పొందే అనుభూతి కోసం నేను అంత కష్టపడుతుంటాను. ఈ సినిమా మల్టిపుల్ ఫార్మాట్స్‌లో విడుదల అవుతుంది. విజువల్ గా గ్రేట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
ఏఆర్ రెహమాన్ గారితో పని చేయడం గురించి…
-రెహమాన్ గారితో ఇది నాకు మూడో సినిమా. ఇంతకుముందు ‘రోబో’, ‘లింగా’ చిత్రాలకు కలిసి పని చేశాం. అంతకుముందు నేను అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ‘బొంబాయి’ సినిమాకు కూడా పనిచేశాను. రెహమాన్ గారు జీనియస్. ఈ సినిమాకి కూడా అద్భుతమైన పాటలు ఇచ్చారు. రీ-రికార్డింగ్ కూడా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.
-నేను నా కెమెరాతో ఒక కథ చెప్పాలని ప్రయత్నిస్తాను. అలాగే రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి. ఒక డీవోపీకి మ్యూజిక్ సెన్స్, ఎడిటింగ్ సెన్స్ ఉండాలి. అవి ఉన్నప్పుడు దర్శకుడికి చాలా హెల్ప్ అవుతుంది. బుచ్చిబాబు గారు నాకు ఈ సినిమా కోసం చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.
నిర్మాత సతీష్ కిలారు గారి గురించి…
-సతీష్ గారు వండర్ఫుల్ ప్రొడ్యూసర్. చాలా మంచి మనిషి. ఆయనకు సినిమా అంటే ప్రాణం. ఒక విజువల్ చూసి చాలా ఎగ్జైట్ అవుతారు. ఎడిటింగ్‌లో బుచ్చిబాబుతో కలిసి ఒక సీన్ చూస్తూ చాలా ఎమోషనల్ అవుతుంటారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఆయన ప్రతి మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మా ఇద్దరి మధ్య కూడా చాలా మంచి అనుబంధం ఉంది.
దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?
-నేను ఇప్పటికే మూడు కథలు రాశాను. మంచి ఎమోషన్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ చేయాలనుకుంటున్నాను. అలాగే ప్రతి పాత్ర కూడా కథలో ఇంపార్టెంట్‌గా ఉండాలి.
ఈ సినిమాకి మీ అబ్బాయి కూడా పని చేశాడని విన్నాం?
అవును. తను కెనడాలో సినిమాటోగ్రఫీ చదువుకున్నాడు. నాలాగే తనకూ సినిమాపై చాలా ప్యాషన్ ఉంది. ‘పెద్ది’కి కూడా చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఇందులో ఒక కుస్తీ ఫైట్ ఉంటుంది. అందులోని ఒక పోర్షన్‌ను తానే చాలా అద్భుతంగా షూట్ చేశాడు. తనకు కలర్ గ్రేడింగ్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ. నాకు చాలా హెల్ప్ చేస్తుంటాడు. ఇప్పుడు డీవోపీగా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచి కథ కోసం చూస్తున్నాడు.



