అమరావతి ఓఆర్‌ఆర్‌కు 17 ఇంటర్‌చేంజ్‌లు

- Advertisement -

అమరావతి ఓఆర్‌ఆర్‌కు 17 ఇంటర్‌చేంజ్‌లు

189.93 కి.మీ. మేర ఆరు వరుసల రహదారి.. ప్రాజెక్టు వ్యయం రూ.30,491 కోట్లకు కుదింపు

17 interchanges for Amaravati ORR

అమరావతి, అక్టోబరు 6 (వాయిస్ టుడే): అమరావతి చుట్టూ నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డులో 17 ఇంటర్‌చేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 189.93 కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో నిర్మించనున్న ఈ యాక్సెస్‌ కంట్రోల్‌ రహదారిలోకి వాహనాలు ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి ఇంటర్‌చేంజ్‌లే ప్రధాన మార్గాలుగా ఉండనున్నాయి.

అమరావతి ఓఆర్‌ఆర్‌ ఆరు జాతీయ రహదారులను క్రాస్ చేయనుంది. జాతీయ రహదారులను కలిసే ప్రాంతాల్లో డబుల్‌ ట్రంపెట్‌ ఇంటర్‌చేంజ్‌లు, రాష్ట్ర–జిల్లా రహదారులను కలిసే చోట సింగిల్‌ లేదా రోటరీ ఇంటర్‌చేంజ్‌లను నిర్మించనున్నారు.

ప్రాజెక్టులో తొలుత 19 ఇంటర్‌చేంజ్‌లను ప్రతిపాదించారు. అయితే ప్రాజెక్టు వ్యయం రూ.38,450 కోట్లుగా ఉండటంతో ఖర్చును తగ్గించే క్రమంలో ప్రతిపాదనల్లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఓఆర్‌ఆర్‌ లోపలి వైపున మాత్రమే సర్వీస్‌ రోడ్లు నిర్మించనున్నారు. బయటి వైపు సర్వీస్‌ రోడ్ల ప్రతిపాదనను తొలగించారు.

అలాగే తెనాలి సమీపం నుంచి చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిలోని కాజా వరకు సుమారు 17.5 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన ఆరు వరుసల అనుసంధాన రహదారిని కూడా పక్కన పెట్టారు. దీంతో రెండు ఇంటర్‌చేంజ్‌లను తొలగించి మొత్తం సంఖ్యను 17కు పరిమితం చేశారు. ఫలితంగా ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30,491 కోట్లకు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు.

ఎక్కడెక్కడ ఇంటర్‌చేంజ్‌లు?

1. కంచికచర్ల: విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై డబుల్‌ ట్రంపెట్‌ ఇంటర్‌చేంజ్‌.

2. పొన్నవరం: కంచికచర్ల–మధిర రాష్ట్ర రహదారి సమీపంలో, ఓఆర్‌ఆర్‌ 3.90 కి.మీ. వద్ద.

3. దుగ్గిరాలపాడు: విజయవాడ–ఖమ్మం–నాగ్‌పూర్‌ జాతీయ రహదారి వద్ద, 18.30 కి.మీ. వద్ద డబుల్‌ ట్రంపెట్‌ ఇంటర్‌చేంజ్‌.

4. మైలవరం: ఇబ్రహీంపట్నం–భద్రాచలం హైవే సమీపంలో, 31.29 కి.మీ. వద్ద డబుల్‌ ట్రంపెట్‌ ఇంటర్‌చేంజ్‌.

5. అడవినెక్కలం–వెల్వడం: ఓఆర్‌ఆర్‌ 42.50 కి.మీ. వద్ద.

6. అగిరిపల్లి: విజయవాడ–నూజివీడు రహదారి సమీపంలో, 47.80 కి.మీ. వద్ద.

7. పొట్టిపాడు: చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై, 66.10 కి.మీ. వద్ద.

8. గన్నవరం: గన్నవరం–పుట్టగుంట రహదారి క్రాస్ అయ్యే ప్రాంతంలో.

9. మానికొండ: విజయవాడ–గుడివాడ రహదారి సమీపంలో.

10. చలివేంద్రపాలెం: విజయవాడ–మచిలీపట్నం హైవే సమీపంలో డబుల్‌ ట్రంపెట్‌ ఇంటర్‌చేంజ్‌.

11. నందివెలుగు: గుంటూరు–హనుమాన్‌పాలెం రహదారి సమీపంలో.

12. బుడంపాడు: నారాకోడూరు సమీపంలో డబుల్‌ ట్రంపెట్‌ ఇంటర్‌చేంజ్‌.

13. అనంతవరప్పాడు–మట్లూరు: రోటరీ ఇంటర్‌చేంజ్‌.

14. పుల్లడిగుంట: గుంటూరు–ప్రత్తిపాడు–పర్చూరు రహదారి వద్ద రోటరీ ఇంటర్‌చేంజ్‌.

15. పొత్తూరు–లింగాయపాలెం: గుంటూరు సమీపంలో డబుల్‌ ట్రంపెట్‌ ఇంటర్‌చేంజ్‌.

16. మేడికొండూరు: వినుకొండ–గుంటూరు హైవే సమీపంలో.

17. బలుసుపాడు: సత్తెనపల్లి–అమరావతి రాష్ట్ర రహదారి సమీపంలో రోటరీ ఇంటర్‌చేంజ్‌.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular