ఒంటరి పోరుకే కమలం…
విజయవాడ, ఫిబ్రవరి 2
సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. పొత్తులతో సంబంధం లేకుండా ఎన్నికల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎన్నికల కథన రంగంలోకి వెళ్లకపోతే ఇబ్బందులు తప్పవని బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశాలతో ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో ఎన్నికల కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు అభ్యర్థులతో సంబంధం లేకుండా ఎన్నికల క్యాంపెయిన్ చేసేలా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అన్ని పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రాల పరిధిలో నేతలను అందుబాటులో ఉండాలని ఆదేశించడంతో పాటు.. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు వెళ్లాలని జాతీయ నాయకత్వం ఏపీ బీజేపీ నేతలను ఆదేశించింది. అందుకోసం 25 పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో ఉన్న ముఖ్యనేతలతో సమావేశాన్ని రెండు రోజుల పాటు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆ పార్టీ నేత శివప్రకాష్.. ఉత్తరాది రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాలను ఏపీలో అమలు చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని.. 10 ఏళ్లలో ఏపీలో చేసిన అభివృద్ధి అంశాలను ప్రజలకు వివరించేలా అడుగులు వేయాలని చెప్పారు.ఏపీలో ఎన్నికల కోసం పని చేయాలి తప్ప.. పొత్తుల గురించి ప్రస్తావన వద్దని అంటోంది బీజేపీ జాతీయ నాయకత్వం. ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో సైతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా, పొత్తుతో వెళ్లాలని నిర్ణయించినా.. ప్రస్తుతం ఈ విషయాన్ని ఎటూ తేల్చడం లేదు. ఇక పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో సైతం ఇదే అంశంపై చర్చకు వచ్చినా.. పొత్తులు, అభ్యర్థుల ఎంపిక జాతీయ నాయకత్వం చూసుకుంటుందని.. ప్రస్తుతం సమయం దగ్గర పడుతోంది కాబట్టి ఎన్నికల కోసం గ్రౌండ్ లెవల్‌లో పని చేయాలని ఆదేశించారు. పైగా ఎన్నికల క్యాంపెయిన్‌లో కూడా పొత్తుల ప్రస్తావన లేకుండా ప్రజల్లోకి వెళ్ళాలని.. అవసరమైతే జాతీయ నేతలు సైతం ఏపీలో ఎన్నికల క్యాంపెయిన్ కోసం వస్తారని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించింది జాతీయ నాయకత్వం.టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ ప్రకటన కోసం ఎదురుచూపులు చూస్తుంటే.. కమలం పార్టీ మాత్రం ఒంటరిగానే తన ప్రయాణాన్ని ఏపీలో కొనసాగించాలని చూస్తోంది. ఇప్పటికే వైసీపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్ళిపోయింది. టీడీపీ ఒంటరిగా ఎన్నికల కోసం సభలు నిర్వహిస్తోంది. ఇక జనసేన సైతం రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే తామేమీ తక్కువ కాదన్న సంకేతాలు పంపేందుకు బీజేపీ నేరుగా పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎన్నికల కార్యాలయాలను ప్రారంభిస్తోంది. వైసీపీ పొత్తులు లేకుండా వెళ్తామని ఇప్పటికే ప్రకటించినా, టీడీపీ-జనసేన పార్టీలకు మాత్రం బీజేపీ వేస్తున్న అడుగులు ఎలా ఉంటాయోనని ఆందోళన పడుతున్నాయి. ఇప్పటికే పొత్తుల విషయంలో స్పష్టత లేదు. పైగా సీట్ల సర్దుబాటుపై ప్రకటన చేయాలన్నా కూడా బీజేపీ కోసం కొన్ని సీట్లు త్యాగాలు చేయాల్సి ఉంది. బీజేపీ, జనసేన పార్టీల బలాబలాలను బట్టి అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో కేటాయించాలి. కానీ బీజేపీ మాత్రం ఒంటరిగా ఇప్పుడు ఎన్నికల క్యాంపెయిన్ చేయడం రెండు పార్టీలకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఇక వైసీపీ.. తమ అభ్యర్థులను మార్పులు చేర్పులు చేస్తూ దాదాపు ఆయా నియోజకవర్గాల పరిధిలో ఇన్‌చార్జులే అభ్యర్థులన్న సంకేతాలను పంపుతోంది. అయితే రాష్ట్ర బీజేపీ కేడర్ మాత్రం.. జాతీయ నాయకత్వం పొత్తుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా.? అని ఎదురుచూస్తోంది. ఆ అంశంపై ఓ క్లారిటీ వచ్చాకే.. ఎవరికి ఎక్కడ కేటాయిస్తారన్న దానిపై ఓ అంచనాకు రావచ్చునని ఏపీ బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఒంటరి పోరుకే కమలం…
- Advertisement -
- Advertisement -