పార్టీ ఉనికి కాపాడుకోనెదేలా…
హైదరాబాద్, ఏప్రిల్ 25
తెలంగాణలో బీఆర్ఎస్‌కు ఎనిమిది నుంచి పది సీట్లు వస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి.. కష్టపడితే మరో రెండు, మూడు సీట్లు వస్తాయని కేసీఆర్, కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సర్వేల పేరుతో కేసీఆర్ పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని కలిగించారు. కేటీఆర్ కూడా వంద స్థానాల్లో విజయం ఖాయమని చెబుతూ వచ్చారు. కానీ చివరికి ఫలితం తేలిపోయింది. ఆ తర్వాత ఓటమి ఖాయమని రెండు వారాల ముందే తేలిందని కానీ అప్పుడు అభ్యర్థుల్ని మార్చలేం కదా అని ఆయన పార్టీ నేతలకు చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. నిజానికి అప్పట్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని ఎక్కువ మంది అనుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ సర్వేల్లో ఎనిమిది నుంచి పది సీట్లు అని చెబుతున్నారు కానీ.. గెలుస్తుందని బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నమ్మలేకపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తక్షణ కర్తవ్యం.. కనీసం ఐదు లోక్ సభ సీట్లు సాధించడం. అలా సాధిస్తేనే ఇంకా ప్రజలు ఆ పార్టీ వైపు ఉన్నారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఒకటి లేదా రెండు సీట్లకు పరిమితమైతే.. వారు కూడా పార్టీలో ఉంటారన్న గ్యారంటీ ఉండదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడిన పరిస్థితులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దశాబ్దన్నర తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, దశాబ్దకాల అధికారం అనుభవించిన పార్టీ ఒక్క ఓటమికే తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. వంద రోజుల్లో రాష్ట్రంలో జరిగిన ఈ పరిణామం రాజకీయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ఆగం చేయగా కళ్ళముందున్న లోక్ సభ ఎన్నికల గండాన్ని గట్టెక్కి కొన్ని స్థానాల్లోనైనా ‘పరువు’ నిలబెట్టుకోవడం ఆ పార్టీకి అందించే అత్యవసరమైన ఆక్సిజన్ గా మారనున్నది. అనేక అవాంతరాల మధ్య సానుకూల పరిస్థితి కోసం కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబం సర్వశక్తులొడ్డుతోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు కనీసం ఊపిరిపోయకపోతే ఆ పార్టీ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరం అయినా 39 మంది ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్షంగానే ఉన్నారు. కానీ ఆ ప్రతిపక్ష స్థానాన్ని బీఆర్ఎస్ కాపాడుకోగలదా అన్న ప్రశ్న ఈ మూడు నెలల్లోనే వచ్చింది. అధికారం ఉందని వలస వచ్చిన నేతలు అధికారం పోగానే తిరుగుముఖం పట్టారు. నిన్నా మొన్నటి ఎవరు ఏ పార్టీలో గెలిచినా బీఆర్ ఎస్ పార్టీలో చేరిపోతారనే విమర్శలు వినిపించేవి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకరో ఇద్దరో మినహా ఫలనా నాయకుడు పార్టీ మారడనే అభిప్రాయానికి తావులేకుండా పోయింది. వారు వీరు అనేదీ లేకుండా అన్ని పార్టీలకు చెందిన వారంతా బీఆర్ఎస్ లో చేరిపోయారు. విపక్షాలకు పోటీచేసే గట్టి అభ్యర్ధిలేకుండా చేసే ప్రయత్నంలో కేసీఆర్ విజయవంతమయ్యారని అనుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా ప్రజలే మారితే పరిస్థితి మరిపోతుంది. తర్వాత అదే జరిగింది. బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓటమి వరకూ అత్యంత బలమైన పార్టీగా కనిపించింది. లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మున్సిపల్ కార్పొరేషన్ లు, జిల్లా పరిషత్ లు, మండల, గ్రామ స్థాయి వరకు అంతా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే ఉన్నారు. వేళ్ళ మీద లెక్కించేంత మంది మాత్రమే విపక్ష పార్టీ ప్రతినిధులున్నారు. ఓ మోస్తారు సంఖ్యలో విపక్షాలు గెలిచినా తెల్లవారేసరికి గులాబీ గూటికి చేరిపోయే వారు. అసెంబ్లీ ఎన్నికల వరకు మూడవసారి ముచ్చటగా అధికారం, వందకు పైగా సీట్లు మనవే అంటూ గంభీరంగా ప్రకటించిన కేసీఆర్ తెలంగాణ ప్రజల విలక్షణ తీర్పుతో ఓటమిపాలైంది. అధికారం కోల్పోయినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండగా ప్రజా తీర్పు నుంచి కోలుకోకముందే పార్లమెంట్ ఎన్నికలురావడం ‘అగ్ని పరీక్ష’గా మారింది. తిరిగి లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు పార్టీ సమాయత్తమవుతున్న తరుణంలో గట్టి దెబ్బతగిలింది. సిట్టింగు ఎంపీల్లో మెజార్టీ పార్టీ చేజారిపోయారు. సగం మంది బీజేపీలో చేరితే మరికొంత మంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నిన్నటి వరకు ఎంపీలుగా ఉన్న సిట్టింగుల్లో కొందరిని మార్చాలని పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుండగా పార్టీలు మారిపోయారు. కొందరు టికెట్ రాదని మారిపోతే, మరికొందరు ఇతర పార్టీల్లో టికెట్ రావడంతో మారిపోయారు. కొందరు మాత్రం ఈ పార్టీ పక్షాన పోటీచేస్తే గెలవడం కష్టమని భావించి పార్టీ ఫిరాయించారు. అభ్యర్ధులుగా ప్రకటించిన తర్వాత గడ్డం రంజింత్ రెడ్డి, కడియం కావ్యలు కాంగ్రెస్ లో చేరిపోవడం ఆ పార్టీ గెలుపు గుర్రం కాకపోవడమే కారణమని చెప్పవచ్చు. రాష్ట్రలోని 17 స్థానాల్లో పోటీలో నిలుపగల నాయకులు ఆ పార్టీలో ఉన్నప్పటికీ నిన్న అధికారంలో ఉన్నప్పటికీ పరిస్థితికి, ఓటమి తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైంది.ఎన్నికలన్న తర్వాత గెలుపోటములు సహజం. కానీ ఒక్క ఓటమికే బీఆర్ఎస్ చెల్లాచెదురు అవుతోంది. లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఓటమి ఎదురైతే.. ఇక బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ అందుకుంటుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీని కాపాడుకునేందుకు మరోసారి రంగంలోకి దిగారు. ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా క్షేత్రస్తాయిలో ప్రచారాన్ని కొనసాగించేందుకు బస్సు యాత్ర చేపట్టడం వల్ల కొంతైనా పార్టీ కేడర్ కు విశ్వాసం పెరుగుతోంది. ఎంపీ ఎన్నికల్లో కొంతైనా ఫలితాలు సానుకూలంగా వస్తే దాని నుంచి ఊపిరిపీల్చుకుని తర్వాత పార్టీని కింది నుంచి నిర్మాణం చేసుకునేందుకు చాన్సు దక్కుతోంది. ఈ త్రిముఖ పోటీలో బీఆరెస్ కనీసంగానైనా ఎంపీ స్థానాలు దక్కించుకోలేకపోతే మొదటికే మోసం వస్తుంది. తిరిగి పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మించి చిత్తుశుద్ధితో ముందుకు పోతే తప్పితే అధికారానికి బాగా అలవాటు పడిన పార్టీలో వచ్చే ఐదేళ్ళ వరకు నాయకులు, కేడర్ ను కాపాడుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రత్యామ్నాయం రూపంలో బీజేపీ రెడీగా ఉంది మరి. అందుకే కేసీఆర్ ఇది.. ఉనికి సమస్యతో కూడిన కఠినమైన సవాల్ అనుకోవచ్చు.
పార్టీ ఉనికి కాపాడుకోనెదేలా…
- Advertisement -
- Advertisement -