Tuesday, January 14, 2025

జగన్ కు దూరమౌతున్న కాపు  వర్గం

- Advertisement -

జగన్ కు దూరమౌతున్న కాపు  వర్గం

The Kapu community is moving away from Jagan

విజయవాడ, డిసెంబర్ 19, (వాయిస్ టుడే)
ఏపీలో అతి బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాపు సామాజిక వర్గం వైసీపీ అధినేత జగన్‌ను వదిలి పెడుతోందా..? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఈ చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఆ మధ్య ఒకేసారి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాజీనామా చేయడంతో ఈ చర్చ మరింత ఎక్కువైంది.2024 ఎన్నికల్లో వైసిపి ఓటమి చెందిన తర్వాత కాపు సామాజిక వర్గ నేతలు వరుసగా ఆ పార్టీకి దూరం అవుతున్నారు. ముందుగా కిలారు రోశయ్య, సామినేని ఉదయభాను లాంటి నేతలు పార్టీకి రాజీనామా చేస్తే ఆ తర్వాత జగన్‌కు అత్యంత నమ్మకమైన స్నేహితుడిగా ఉన్న ఆళ్లనాని కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇది వైసిపినే కాకుండా రాష్ట్ర రాజకీయాలను కూడా షాక్‌కు గురి చేసింది. నిజానికి తొలి విడతలోనే ఆళ్ల నానిని మంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి కోల్పోయినప్పుడు నుంచి ఆయన ముభావంగానే ఉంటూ వచ్చారు. పార్టీ అధికారం కోల్పోగానే జగన్‌కు బై బై చెప్పేశారు. భీమవరంలో గ్రంధి శ్రీనివాస్‌ది కూడా అదే దారి. ఏకంగా 2019లో జనసేన అధినేత పవన్‌ను ఓడించి జయింట్ కిల్లర్‌గా పేరుపొందిన గ్రంధి శ్రీనివాస్‌కు కనీసం రెండో విడతలోనన్నా మంత్రి పదవి గ్యారెంటీ అని భావించారు. కానీ పలు సమీకరణల దృష్ట్యా జగన్ ఆయనపై దృష్టి పెట్టలేదు. దీనితో తనకు సరైన గుర్తింపు దక్కలేదని ఎప్పటినుంచో భావిస్తున్న గ్రంధి శ్రీనివాస్ ఎన్నికల తర్వాత పార్టీని వదిలేసారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే అటు వైపు వెళ్ళిపోతారన్న విమర్శలు ఎదుర్కొనే అవంతి శ్రీనివాస్ కూడా వైసిపి నుంచి బయటికి వచ్చేసారు. జగన్ హయంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతానికి వీరు మాత్రమే కాకుండా మరికొందరు కాపు నేతలు కూడా వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన కాపులను, కాపులు జనసేన ను ఓన్ చేసుకుంటున్నారు. పవన్‌ను  ఒక సీరియస్ పొలిటిషన్‌గా వారు గుర్తించడానికి కొంత టైం పట్టింది. ఎప్పటికైనా ఏపీలో కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న వ్యక్తిగా పవన్ని చూస్తున్నారు. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో జనసేన సాధించిన 100% విజయం. ఇలాంటి పరిస్థితుల్లో వేరే పార్టీల్లో ఉండటం కన్నా జనసేనకు షిఫ్ట్ కావడమే మంచిదనే ఆలోచనలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు భావిస్తున్నారు. వీలైతే జనసేన లోనికో లేకుంటే కనీసం కూటమిలోని ఇతర పార్టీల్లోకో వెళ్లడం ప్రస్తుతానికి బెటరనే ఆలోచనలు వీళ్లు ఉన్నారు.విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకు కాపు సామాజిక వర్గం దాని అనుబంధ కులాల లీడర్లు ఎక్కువగా ఉన్నారు. ఓటర్లపరంగా కూడా వారి ప్రభావం ఈ ప్రాంతాల్లో ఉంటుంది. వైసీపీలో ఆ ప్రాంతాలకు సంబంధం లేని రెడ్డి లీడర్లు సలహాదారుల పేరుతో పెత్తనం సాగించడం చాలా మందికి నచ్చడం లేదు.  జగన్‌కు తమకు మధ్య అడ్డుకట్టలా వాళ్లు మారిపోతున్నరని అసహనానికి లోనవుతున్నారు. దానికి తోడు జగన్ కూడా క్షేత్ర స్థాయి పరిస్థితులను లెక్క లోకి తీసుకోకుండా తోచినట్టు చేసుకుపోతున్నారనే ఆరోపణ ఉంది. ఇక తమ సామాజిక వర్గానికి చెందిన పవన్‌ను తమ తోనే తిట్టిస్తూ రావడం వల్ల ఓటు బ్యాంకు పూర్తిగా దెబ్బతింటుందని భావించిన కాపు లీడర్లు వైసీపీకి బై బై చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకెంత మంది కాపు లీడర్లు బయటకు వస్తారో జగన్ వారికి ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్