29.6 C
New York
Wednesday, June 19, 2024

17 జిల్లాలా… 22 జిల్లాలా…

- Advertisement -

17 జిల్లాలా… 22 జిల్లాలా…
హైదరాబాద్, మే 21 (వాయిస్ టుడే)
ఎన్నికల కోడ్ ముగుస్తుండడంతో పాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి, ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. తమ ప్రభుత్వం రాగానే తెలంగాణలో జిల్లాల సంఖ్య తగ్గిస్తానని గతంలో హామీ ఇచ్చిన ఆయన, ఇప్పుడు ఇదే అంశంపై సీనియర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. గతంలో కేసీఆర్ పరిపాలనా సౌలభ్యం కోసం ఉమ్మడి 10 జిల్లాల సంఖ్యను 33 జిల్లాలుగా మార్చారు. అయితే, ఈ విభజన శాస్త్రీయంగా జరగలేదని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఆరోపిస్తూ వచ్చింది. కొన్ని ప్రాంతాలలో ఒక్కో జిల్లాను 5 ముక్కలుగా చేయడంతో పాలనా పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు సైతం మొత్తుకున్నారు. అందుకు సంబంధించి అప్పటి కేసీఆర్ సర్కార్‌కు నివేదికలు సైతం అందజేశారు. అయితే, గత ప్రభుత్వ కాలంలో పనిచేసిన కొందరు పెద్దలు కేసీఆర్‌ను తప్పుదోవ పట్టించారని, వాళ్ల డిమాండ్‌కు తలొగ్గిన కేసీఆర్ తీసుకున్న తొందరపాటు నిర్ణయమే దీనికి కారణంగా కొందరు బాహాటంగానే విమర్శించారు. 33 జిల్లాలకు సంబంధించి నిధుల సమస్య కూడా ఎదురవుతోందని ప్రస్తుత ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటికే నివేదికలు అందించారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు జిల్లాల పునర్వవస్థీకరణపై ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే ఈ విషయమై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఎన్నికల కోడ్ ముగియగానే యుద్ధ ప్రాతిపదికన జిల్లాల కుదింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.ఉమ్మడి ఏపీ నియోజకవర్గాల పునర్విభజన టైమ్‌లో అప్పటి సర్కార్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూడా అదే తరహాలో ఉన్నతాధికారులతో తెలంగాణలోనూ జ్యూడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ కమిటీ ఇచ్చే గైడెన్స్ మేరకు జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు. జిల్లాల విషయంలో తమ ప్రభుత్వ ఆలోచనను అసెంబ్లీలో ప్రతిపాదించి సభ్యులతో చర్చించి అనంతరం కుదింపుపై నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలు 17. వాటికి డీలిమిటేషన్ ప్రకారం చూస్తే 1/3 జిల్లాలు పెరుగుతాయి. ఆ లెక్కన 17+6 =23 జిల్లాలు అవుతాయి.జనాభా లెక్కల ప్రకారం చేస్తే 22 జిల్లాలు అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. జ్యుడీషియల్ కమిషన్ నివేదికతో పాటు నిధులకు అనుకూలంగా ఉండేలా చివరకు 22 లేదా 23 జిల్లాలను ప్రభుత్వం ఫైనల్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నాయి. కొందరు అధికారులు మాత్రం పార్లమెంట్ నియోజకవర్గాలు 17 ఉండగా దానికి అనుగుణంగా, 17 జిల్లాలను చేయాలని దానివల్ల నిధులకు, ఖర్చుకు కూడా ఇబ్బందులు ఉండవని పేర్కొంటుండగా జ్యుడీషియల్ నివేదికనే ఫైనల్ అని ప్రభుత్వం పేర్కొంటున్నట్టుగా తెలిసింది. రానున్న రోజుల్లో ఒకవేళ 17 జిల్లాలు చేస్తే గొడవలు జరిగే అవకాశం ఉందని, రాజకీయంగా పార్టీలకు నష్టం జరిగే అవకాశం ఉందని కూడా ఆ వర్గాలు పేర్కొంటుండడం విశేషం. అయితే, జ్యుడీషియల్ కమిషన్ నివేదిక వచ్చిన తరువాత దానిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం నిర్ణయించినట్టుగా సమాచారం.కొత్తగా ఏర్పాటు చేసే ఒక జిల్లాకు (ఉమ్మడి వరంగల్ జిల్లాలోని) పీవీ నరసింహరావు పేరు పెడతామని, జనగామ జిల్లా పేరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తామని ఇప్పటికే కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం ఆసిఫాబాద్ జిల్లాకు గోండు వీరుడు కొమురం భీం పేరును పెట్టగా, కొత్తగూడెం జిల్లాకు పుణ్యక్షేత్రం భద్రాచలం పేరును, భూపాలపల్లి జిల్లాకు తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ పేరు, గద్వాల జిల్లాకు శక్తిపీఠం జోగులాంబ పేరు, భువనగిరి జిల్లాకు పుణ్యక్షేత్రం యాదాద్రి పేర్లను పెట్టింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రెండు జిల్లాల పేర్లను మార్చాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!