Breaking News
Saturday, July 27, 2024
Breaking News

జర్నలిస్టులకు అండగా టీడబ్ల్యూజేఎఫ్

- Advertisement -
TWF supports journalists

-జర్నలిస్టుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
-టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
-ఘనంగా మహబూబాబాద్ జిల్లా మహాసభ

రాష్ట్రంలో జర్నలిస్టులకు అండగా నిలిచే ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మాత్రమే అని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతర పోరాటాలు చేస్తామని ప్రకటించారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని షోయబుల్లాఖాన్ ప్రాంగణంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ద్వితీయ మహాసభ జరిగింది. జిల్లా అధ్యక్షుడు మట్టూరి నాగేశ్వరరావు అధ్యక్షతన టాక్ జరిగిన ఈ మహాసభలో మామిడి సోమయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ పదవుల కోసం, అక్రమ సంపాదన కోసం పాకులాడే సంఘాల పట్ల జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని సంఘాలు జర్నలిస్టుల సమస్యలను గాలికొదిలేసి ప్రభుత్వాలకు కొమ్ము కాస్తున్నాయని ధ్వజమెత్తారు. టీడబ్ల్యూజేఎఫ్ ప్రజాస్వామ్యబద్దంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాడే యూనియన్ అని అన్నారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు అన్యాయం చేసిందని, ఆ ప్రభుత్వానికి కొమ్ముకాసిన యూనియన్లు జర్నలిస్టులకు కనీసం ఇండ్ల స్థలాలు కూడా ఇప్పించలేకపోయాయని విమర్శించారు. మరొక యూనియన్ నాయకులు ప్రభుత్వ పదవుల కోసం జర్నలిస్టులను పావులుగా వాడుకుంటున్నదని ఆరోపించారు. ఏ పదవులూ ఆశించని టీడబ్ల్యూజేఎఫ్ కేవలం జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పోరాడుతున్నదని అన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడ్డారని, ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని, అందుకే జర్నలిస్టులు సైతం ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని కోరుకున్నారని అన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్ కార్డులు, పెన్షన్ స్కీమ్ వంటి దీర్ఘకాలిక డిమాండ్ల సాధనకై తమ సంఘం నిరంతరం పోరాడుతుందని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగా కాలయాపన చేస్తే పోరాటం చేయక తప్పదని అన్నారు. ఇవాళ జర్నలిస్టు సంఘాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, పదిమంది కలిసి సంఘం పెడుతున్నారని, కులాల వారిగా సంఘాలు ఏర్పడుతున్నాయని అన్నారు. కలానికి కులం లేదని, పలచనైతే చులకనవుతామని, జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండాలని మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. మీడియా రంగంలో రాబోయేది డిజిటల్ యుగం అని, చిన్న పత్రికలు, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వ్యవస్థలు విస్తరించాయని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులను గౌరవించి ఆదుకోవాల్సిన పాలకులు విస్మరించడం సరైంది కాదని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఉద్యోగ, ఆరోగ్య భద్రత, పెన్షన్ స్కీమ్, హెల్త్ స్కీమ్, ప్రత్యేక రక్షణ చట్టం వంటి డిమాండ్ల సాధనకై నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. అవకాశవాద జర్నలిస్టు సంఘాలకు భిన్నంగా, జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సంఘం టీడబ్ల్యూజేఎఫ్ అని మామిడి సోమయ్య అన్నారు. జిల్లాలో అన్యాయానికి గురవుతున్న జర్నలిస్టులకు అండగా ఉంటూ సంఘాన్ని బలోపేతం చేయాలని ఆయన జిల్లా నాయకత్వాన్ని కోరారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల కోసం ఐఎఫ్ డబ్ల్యూజే పోరాడుతుందని తెలిపారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని, ఇందు కోసం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్ తో ఐఎఫ్ డబ్ల్యూజే పోరాడుతుందని అన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్, కోశాధికారి ఆర్. వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా టీడబ్ల్యూజేఎఫ్ బలంగా ఉందని, మహబూబాబాద్ జిల్లాలో కూడా తిరుగులేని యూనియన్ గా తయారు చేయాలని కోరారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!