మనీ లాండరింగ్ లో …
ఛండీఘడ్ సెప్టెంబర్ 28: కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు గురువారం (సెప్టెంబర్ 28) అరెస్ట్ చేశారు. డ్రగ్స్ స్మగ్లింగ్, మనీలాండరింగ్‌లో ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నట్లు బయటపడటంతో ఈ మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు తెల్లవారు జామున జరగిని సెర్చ్ ఆపరేషన్‌లో పంజాబ్ పోలీసుల బృందం జలాలాబాద్‌లోని ఫజిల్కాలో ఖైరా నివాసానికి చేరుకుని ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.2015లో నమోదైన పాత డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈ దాడి నిర్వహించారు. ఈ కేసులో భోలాత్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా నిందితుడిగా తేలడంతో గురువారం ఉదయం చండీగఢ్‌లోని ఆయన నివాసంలో పోలీసులు దాడి చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద గతంలో నమోదైన కేసులో భాగంలో జలాలాబాద్ పోలీసులు ఈ ఉదయం ఎమ్మెల్యే నివాసంలో సోదాలు జరిపారు. అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉండటం, వారికి ఆశ్రయం కల్పించడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందడం వంటివి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్ ప్రకారం.. ఈ విధంగా ఆర్జించిన నిధులను ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించినట్లు తెలుస్తోంది. 2014 నుంచి 2020 మధ్య కాలంలో ఖైరా ప్రకటించిన ఆదాయానికి మించిన ఖర్చు చూపడంతో పోలీసుల నిఘా అతనిపై పడింది. దాదాపు రూ.6.5 కోట్లు ఖర్చు చేసినట్లు తేలింది.