Wednesday, September 18, 2024

రాంగ్ ట్రాక్ లో కేటీఆర్…?

- Advertisement -

రాంగ్ ట్రాక్ లో కేటీఆర్…?
హైదరాబాద్, మార్చి 29
లోక్‌సభ స్థానాల వారీగా చేస్తున్న సమీక్షా సమావేశాల సందర్భంగా అగ్రనేతల వ్యవహారశైలిపై బీఆర్ఎస్ క్యాడర్‌లో అసంతృప్తి కనిపిస్తోంది. కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి… ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం సమీక్షకు ఆహ్వానించిన వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు కూడా ఏ మాత్రం ప్రయత్నించడంలేదు. దీంతో ద్వితీయ శ్రేణి క్యాడర్ లో అసహనం పెరిగిపోతోంది. పరిస్థితి దిగజారిపోతూంటే.. కేటీఆర్ సమీక్షల పేరుతో పిలిచి .. ఇలా ప్రసంగాలు ఇచ్చి పంపించేస్తూండటంతో చాలా మంది ఆసక్తి కోల్పోతున్నారు.సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ స్థానాలపై హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సమీక్షా సమావేశాలను నిర్వహించారు. అభ్యర్థులు, ఇతర సీనియర్‌ నేతలు హాజరయ్యారు. కానీ అసలు సమీక్ష అంట ూఏమీ జరగలేదు. ఎంపీ స్థానంలో బలాబలాలేంటి..? బలహీనతలేంటి..? గతంలో జరిగిన పొరపాట్లేంటి..? వాటిని ఇప్పుడు ఎలా అధిగమించాలి..? స్థానిక నేతల మధ్య సఖ్యత ఉందా? లేదా? లేకపోతే వారిని ఎలా సమన్వయం చేయాలి..? ప్రత్యర్థులు, వారి పార్టీల స్థితిగతులేంటి..? ఇలా సమస్యలను గుర్తించి పరిష్కరించి క్యాడర్‌కు దిశా నిర్దేశం చేయాలి. కానీ కేటీఆర్ అసలు ఇదంతా పనికి రాని వ్యవహారం అనుకుంటున్నారు. అధిష్టానం వద్ద పలుకుబడి కలిగిన ఒకరిద్దరు నేతలు మాట్లాడటం, ఆ తర్వాత వర్కింగ్‌ ప్రెసిడెంట్‌తో మాట్లాడించి, వెంటనే సమావేశాన్ని ముగింపజేయటం పరిపాటిగా మారింది. కేటీఆర్ ప్రధానిపైనా, ముఖ్యమంత్రిపైనా నోరు పారేసుకోవటం, దుర్భాషలాడటం చేస్తున్నారు. అవి మీడియాలో హైలెట్ కావొచ్చు కానీ.. ఎన్నికల్లో ఎలా ఉపయోగపడతాయని క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు. ఎన్నికల సభల్లో అలాంటి విమర్శలు చేసుకోవచ్చు కానీ.. సమీక్షల్లో చేయాల్సిన అవసరం ఏమిటనేది సమావేశాలకు హాజరయ్యే వారికీ అర్థం కావడం లేదు. తమను ఓడించి ప్రజలు తప్పు చేశారని.. వారు తప్పు తెలుసుకుంటారన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రెండు కంటే తక్కువ శాతం ఓట్ల తేడా ఉందని ఆ మార్పు రావడానికి ఎంతో కాలం పట్టదని బీఆర్ఎస్ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. కేటీఆర్ పదే పదే ఈ రెండు శాతం తేడా ఓట్ల సిద్దాంతాన్ని చెబుతున్నారు. ప్రజలు తప్పు చేశారన్నట్లుగా మాట్లాడుకున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. గెలిచిన పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారిస్తాయి. వాళ్లకు అవకాశం ఇచ్చిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తాయి. కానీ తెలంగాణలో మాత్రం భిన్నపరిస్థితులు నెలకొన్నాయి. బీఆరెస్‌ ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నది. ప్రజలకు తాము ఎంతో చేసినా మమ్మల్ని ఆదరించలేదని వాపోతున్నది. వాస్తవాలను విస్మరిస్తే అవి మరో రూపంలో ముందుకు వస్తాయన్న వాస్తవాన్ని గత పాలకులు ఇప్పటికీ అంగీకరించడం లేదన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణలో కనీ వినీ ఎరుగని అభివృద్ధి చేశామని అయినా ప్రజలు ఓడగొట్టారని .. వాళ్లకు మంచి చేయకుండా యూట్యూబ్ చానళ్లు పెట్టుకున్నా గెలిచేసేవారమని కేటీఆర్ నిట్టూర్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ తీరు చూస్తూంటే… ఆయన ప్రజా తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారని సులువుగానే అర్థమవుతుంది. రాజకీయాల్లో అభివృద్ధి అనే ప్రాతిపదికన ఎన్నికలు జరిగితే చరిత్రలో కొంత మంది నేతలకు ఓటమి అనేదే ఉండకూడదు. అయినా వారెవరూ తాము అభివృధ్ధి చేయకుండా కుల రాజకీయాల్ని చేసి ఉంటే గెలిచి ఉండేవాళ్లమని అనుకోలేదు. మరోసారి కష్టపడి ప్రజల మనసుల్ని గెలుచుకనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే అది రాజకీయం. ప్రజాస్వామ్య రాజకీయాలు అంటే అంతే. ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు.. ఎందుకు తిరస్కరిస్తారో అంచనా వేయలేం. అయితే తెలంగాణలో ప్రజలు కేటీఆర్, కేసీఆర్ లను వద్దనుకోవడానికి .. అభివృద్ధి కారణం కాదు. ఈ విషయంలో ప్రజలు బీఆర్ఎస్ కు మేలైన మార్కులు వేస్తారు. అయినా అధికారంలో ఉండకూడదని కోరుకున్నారు. దానికి కారణం ఖచ్చితంగా యూట్యూబ్ చానళ్లు పెట్టులేకపోవడం కాదు. ఎందుకంటే.. కాంగ్రెస్ కు పది శాతం మీడియా.. ఆన్ లైన్ మీడియా సపోర్ట్ ఉంటే.. మిగతా 90 శాతం బీఆర్ఎస్‌కే ఉంది. లోక్‌సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు అత్యంత కీలకం. ఫలితాలు తేడా వస్తే పార్టీ ఉనికిపైనే ప్రభావం చూపుతుంది. ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్న తరవాత లోపాలు సవరించుకుని ప్రయత్నిస్తే కోలుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా.. ప్రజలే తప్పు చేశారని అనుకుని.. వారు పశ్చాత్తాప పడతారని భావిస్తూ ఆత్మవంచన చేసుకుంటే.. ఇంకా ఇంకా నష్టపోతామని పలువురు నేతలు అంతర్గత సంభాషణల్లో సెటైర్లు వేస్తున్నారు. ఎలాంటి ఫలితమైన బీఆర్ఎస్ నాయకత్వం తీసుకునే చర్యలను బట్టే ఉంటుందనుకోవచ్చు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్