Sunday, October 6, 2024

ప్రజారోగ్యానికి గ్యారంటీ కావాలి

- Advertisement -

ప్రజారోగ్యానికి గ్యారంటీ కావాలి

 

హైదరాబాద్ 24( వాయిస్ టుడే ప్రతినిధి)

 

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ మనందరికీ తెలిసిన విషయమే.నేటి ఆధునిక కాలంలో కరువు అవుతున్నదే అవి.మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఆరోగ్య సమస్యలు సర్వసాధారణమయ్యాయి.ఏదో ఒక అనారోగ్య సమస్య లేకుండా ఎవరైనా ఉంటారంటే నమ్మగలమా? కొందరు అన్నమే దొరక్క పస్తులతో చస్తుంటే,మరి కొందరికి రకరకాల హోటళ్లు,రెస్టారెంట్లు,ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు,బేకరీల్లోని కల్తీ ఆహార పదార్థాలను తింటూ ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకుంటున్నారు.

 

చావు దరి చేరుతున్నారు.పేదరికం వెంట వచ్చే ఆకలి,పరిశుభ్రమైన నీరు,గాలి లేక పోవడం వంటివీ కీలకమే.రాష్ట్రంలోని తాజా పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు.వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని రాష్ట్ర ఆహార భద్రతా విభాగం గత మూడు వారాలుగా చేస్తున్న విస్తృత తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయి.ఆహారం కల్తీ కావడం నిత్యకృత్యమైంది.ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే కల్తీలేనీ ఆహారమే లేదు.వంట గదుల నుంచి వండే పదార్థాల దాకా అన్నీ అపరిశుభ్రమే.అందులో నాణ్యతా ప్రశ్నార్థకమే.

 

ఇండ్లల్లో వంట చేసుకునే సమయం లేక,ఉన్నా బద్దకించి ఆన్‌లైన్‌ ఆర్డర్ల ద్వారా ఫుడ్‌ తెప్పించుకునే పరిస్థితి.ఇదే అవకాశంగా తీసుకుని కాలం చెల్లిన మసాలాలను కలిపి పాడైపోయిన పదార్థాలను వేడి వేడిగా వడ్డించే హోటళ్లు,రెస్టారెంట్లు అనేకం.

 

ఘుమ ఘుమలాడే వాసనలు, ఆకర్షణీయమైన రంగులు,వేడివేడి వడ్డన ఆకట్టు కుంటున్నా,తింటే మాత్రం అనారోగ్యం తథ్యం.జీవనశైలీ వ్యాధులు అంటడం ఖాయం.ఆపైన ఆస్పత్రిలో రెస్ట్‌ తప్పదు మరి.పదే పదే కాచిన నూనెల వినియోగం,గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని పీల్చిపిప్పి చేస్తు న్నాయి.హోటళ్లలో ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన పదార్థాలు,నకిలీ వాటర్‌ బాటిళ్లు,చాక్లెట్లు,మసాలాలు, చీజ్‌,సిరప్‌,శాండ్‌విచ్‌ బ్రెడ్‌లను అక్రమంగా విక్రయిస్తున్నారనేది బహిరంగ సత్యం.

 

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 14 వేలకుపైగా ఆహారపు శాంపిళ్లను సేకరిస్తే 3800పైగా శాంపిళ్లల్లో నాణ్యతకు సంబంధించి వివిధ హోటళ్లకు రాష్ట్ర ఆరోగ్య విభాగం సలహాలు,సూచనలు చేయాల్సి వచ్చింది.2500కు పైగా శాంపిళ్లల్లో అసలు నాణ్యత లేదని స్పష్టమైంది.300కుపైగా శాంపిళ్లు భారీగా కల్తీతో ఉన్నట్టు నిర్థారించింది.

 

రాష్ట్ర రాజధానిలోనే ఇంత దారుణ పరిస్థితి ఉంటే,ఇక జిల్లాల్లో అంచనా వేయగలమా? రుచి సంగతి పక్కన బెడితే శుచిని ఆశించగలమా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.జీవన శైలీ ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పులు వస్తుండటం,ఇది ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతుండటమూ గమనార్హం.జంక్‌ఫుడ్స్‌,వ్యాయామం లేకపోవడం,భోజనం,నిద్రకు సమపాలన లేకపోవడం తోనే వ్యాధులు ప్రబలుతున్నాయి.

 

ఆహారంతోనే దాదాపు 56 శాతం వ్యాధులు సంక్రమిస్తున్నాయనేది జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) అంచనా.మంచి ఆరోగ్యం కోసం ఏం తినాలి? ఎప్పుడు తినాలి? తదితర అంశాలను డైటరీ గైడెన్స్‌ ఫర్‌ ఇండియన్స్‌ పేరుతో ఎన్‌ఐఎన్‌ తాజాగా విడుదల చేసింది.పోషకాహారంతో బీపీ,షుగర్‌ ఇతర ముప్పులను తగ్గించుకోవచ్చు. ఉప్పు,చక్కెర,అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ (చిప్ప్‌,బర్గర్లు,పిజ్జా,కూల్‌డ్రింక్స్‌) విషయంలో అప్రమత్తత తప్పనిసరి.జిహ్వ చాపల్యం తీర్చుకునే పేర కంట్రోల్‌ తప్పితే ఇక అంతే సంగతులు.

 

ప్రజలకు సమతుల ఆహారం అందజేసే బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవాలి.ఇక్కడ సర్కారు ఒక్కరిదే బాధ్యత కాదు.ప్రజలూ అందులో భాగస్వాములవ్వాలి.తాజా కూరగాయలు,పండ్లను తమ మెనూలో పెట్టుకోవాలి.

 

కాగా సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తరుణంలో పనిగంటలు పెరగడం, కుటుంబాల ఉమ్మడి సంతోష సమయం తగ్గిపోవడం, కార్పొరేటీకరణ,నిరుద్యోగం అధికం కావడం తదితర కారణాలతో ఆర్థిక మూలాలు దెబ్బతినడంతో ప్రజలకు ఆరోగ్య ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

 

పార్లమెంటు ఎన్నికల తర్వాత పరిపాలన పైనే పూర్తిగా దృష్టి పెడతామని సీఎం రేవంత్‌ చెప్పారు.కల్తీ ఆహారాన్ని అమ్మే హోటళ్లు,రెస్లారెంట్లు,బేకరీలపై ఉక్కుపాదం మోపాలి.కన్నెర్ర చేయాల్సిన అవసరమూ ఉంది.వాటి పీచమణిస్తే కొంతలో కొంతైనా ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించినట్టే.ప్రజలకు సేవలందించే అన్ని శాఖల్లో పేరుకు పోయిన బూజును దులపాలి.నిరంతర తనిఖీలు,పరిశీలన,కఠిన చర్యలతో సర్కారీ శాఖలను ప్రజల గుమ్మాలు తొక్కేదాకా పరిగెత్తించాలి.ఆయా వృత్తుల వారికి అవగాహనా కార్యక్రమాలు పెంచాలి.

 

అవినీతిపై కొరడా ఝులిపించాలి.సమతుల ఆహారాన్ని అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి గ్యారంటీ ఇవ్వాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్