మరో రెండు కార్పొరేట్ దిగ్గజ సంస్థలు
హైదరాబాద్, ఆగస్టు 25 : తెలంగాణ వేదికగా తమ కార్యకలాపాల విస్తరించేందుకు మరో రెండు కార్పొరేట్ దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక, బీమా సేవల సంస్థగా పేరొందిన మెట్‌లైఫ్ తమ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో స్థాపించేందుకు సిద్ధమైంది. అలాగే హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను భారీగా విస్తరించడానికి ‘గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్స్ఛేంజ్(జీహెచ్‌ఎక్స్)’ అనే మరో కార్పొరేట్ సంస్థ సైతం తమ ప్లాన్‌ను తెలియజేసింది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో గురువారం ఆయా సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. వివిధ అంశాల గురించి చర్చలు జరిపారు.వివిధ అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలకు హైదరాబాద్ చిరునామాగా మారుతోంది. అయితే ఇప్పుడు వాటి వరుసలో మరో ఆర్థిక సేవలు, బీమా దిగ్గజ సంస్థ చేరడం విశేషం. ఇదిలా ఉండగా గురువారం రోజన న్యూయార్క్‌లోని మెట్‌లైఫ్ కేంద్ర కార్యాలయంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆ సంస్థ సీనియర్ ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యారు. వాస్తవానికి మెట్‌లైఫ్ అనే కంపెనీ ప్రపంచంలోనే అత్యధిక మందికి బీమా, ఆర్థిక సేవలు అందిస్తున్న సంస్థగా ప్రసిద్ధి చెందింది. అమెరికా ఫార్చ్యూన్ 500 జాబితాలో కూడా ఈ సంస్థ ఉండటం మరో విశేషం. హైదరాబాద్‌లోని తన గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుండటంపై కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. తాను న్యూయార్క్‌లో విద్యార్థిగా, ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో మెట్‌లైఫ్ కార్యాలయ భవన రాజసం, నిర్మాణ శైలి తనను ఎంతో ఆశ్చర్యపరిచేవని పాత జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు. అదే కేంద్ర కార్యాలయంలో ఈ రోజు సొంత రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తూ సమావేశమవడం, ఎంతగానో ఆనందాన్నిచ్చిందని అన్నారు. ఇదిలా ఉండగా న్యూయార్క్‌లో గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్స్ఛేంజ్ (జీహెచ్‌ఎక్స్) సంస్థ చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ క్రిస్టీ లియోనార్డ్ బృందంతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీజే సింగ్ మాట్లాడుతూ ‘‘ హెల్త్‌కేర్ రంగం డిజిటల్ దిశగా ప్రయాణాన్ని ప్రారంభించిందని అన్నారు. దీనివల్ల ఇందులో కంపెనీలు డిజిటలీకరణ, ఐటీ ఆధారిత సేవలపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. మా ప్రస్తుత కార్యకలాపాలను 2025 నాటికి మూడు రేట్లు చేసే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగర కేంద్రంగా ఇంజినీరింగ్, ఆపరేషన్ కార్యకలాపాలను భారీగా విస్తరిస్తామన్నారు. తెలంగాణలో హెల్త్ కేర్ రంగానికి అద్భుతమైన అనుకూల వాతావరణముందని.. అలాగే మానవ వనరులతో సహా ఇదే రంగానికి సంబంధించిన అనేక సంస్థల సమ్మిళిత ఎకో సిస్టం అభివృద్ధి చెందిందని వెల్లడించారు. మా ఆలోచనలను బలోపేతం చేస్తూ జీహెచ్‌ఎక్స్ తన విస్తరణ ప్రణాళికలను హైదరాబాద్ కేంద్రంగా ప్రకటించడం అభినందనీయమని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు.