చేవెళ్లలో ట్రైయాంగ్యులర్ ఫైట్
హైదరాబాద్, మే 4, (వాయిస్ టుడే)
చేవెళ్ల రాజకీయాలు ఈసారి ఆసక్తికరంగా మారాయి. అక్కడ పోటీ చేయబోతున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచినవారే. ఈసారి ఆ ఇద్దరు అభ్యర్థులనే ప్రత్యర్థులుగా ఎదుర్కోబోతుంది బీఆర్ఎస్. కాంగ్రెస్, బీజేపీ రెడ్లకు టికెట్లు ఇస్తే.. బీఆర్ఎస్ బీసీని బరిలోకి దించుతోంది.2014, 19 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి రెండుసార్లు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. 2014లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌పై గెలుపొందారు. 2019లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రంజిత్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై విజయం సాధించారు. మారిన రాజకీయ పరిణామాలతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలోకి వెళ్లగా, రంజిత్ రెడ్డి లేటెస్ట్‌గా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఇద్దరు నేతలు కూడా ఆయా పార్టీల నుంచి అభ్యర్థులుగా రంగంలోకి దిగనున్నారు.ప్రస్తుతం జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న మాజీ బీఆర్ఎస్ నేతలను ఎదుర్కొనేందుకు గులాబీ పార్టీ మూడోసారి కొత్త అభ్యర్థిని ఎంపిక చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా గుర్తింపు ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌ను అభ్యర్థిగా ఖరారు చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ బీఆర్ఎస్ నేతలను ఎదుర్కొనేందుకు అనుగుణంగా వ్యూహాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు.జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీమంత్రి సబిత ఇంద్రారెడ్డి నివాసంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆ ఇద్దరు నేతలను ఎదుర్కొనేందుకు వ్యూహ రచన రెడీ చేశారు. ప్రత్యర్థులుగా ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్‌రెడ్డిని ఓడించి.. చేవెళ్ల ఎంపీ నియోజకవర్గంలో పార్టీకి ఉన్న పట్టును కొనసాగించాలని భావిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.చేవెళ్ల ఎంపీ నియోజకవర్గ పరిధిలోని.. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహాశ్వరం, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలోని వికారాబాద్, తాండూర్, పరిగి నియోజకవర్గాల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. మెజారిటీ ఓటర్లు పట్టణ ప్రాంతంలోనే ఉండటంతో కచ్చితంగా తమకు కలసి వస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.గతంలో బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తుండటం బీఆర్ఎస్ కు కాస్త ఇబ్బందికరంగా మారింది. కొంత క్యాడర్, లీడర్లు ఆ నేతలతో వెళ్లిపోయారు. ఇప్పుడున్న సొంత పార్టీ నేతలు సంపూర్ణంగా సహకరిస్తే తప్ప గెలుపు అంత ఈజీ కాదన్న అనుమానాలు కూడా బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి.కాంగ్రె్‌సను చేవెళ్లలో అసంతృప్తుల బెడద వెంటాడుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో చివరి వరకూ తర్జనభర్జనలు పడిన కాంగ్రెస్ చివరకు బీఆర్‌ఎస్ సిటింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చింది. నిజానికి, ఆయన కంటే ముందే పార్టీలో చేరిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డికి చేవెళ్ల టికెట్ ఇస్తామని హామీ ఇచ్చింది.దీంతో ఆమె ప్రచారం కూడా మొదలుపెట్టారు. మాజీ ఎమ్మెల్యే కేఎల్లాఆర్ తదితరులు కూడా ఈ సీటు ఆశించారు. కానీ, అనూహ్యంగా రంజిత్‌రెడ్డికి టికెట్ ఇచ్చి సునీతకు మల్కాజిగిరి కేటాయించారు. అయితే, రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ సీనియర్లు కొందరు ఇంకా జీర్ణించుకోవడం లేదు. అసంతృప్త నేతలను దారికి తెచ్చుకునే విషయంలో కాంగ్రెస్ నాయకత్వంతోపాటు రంజిత్ రెడ్డి కూడా ఇంకా పూర్తిస్థాయిలో సఫలం కాలేదు. ప్రచారంలో కొందరు అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు.కొన్నిచోట్ల బహిరంగంగానే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రశ్నించడం గమనార్హం. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ కేడర్‌పై కేసులు పెట్టిన వారిని తీసుకొచ్చి ఇప్పుడు వారి తరఫున ప్రచారం చేయమంటే ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు. అసంతృప్త నేతలను పార్టీ నేతలు బుజ్జగించే యత్నాలు చేస్తున్నారు. చేరికలూ గందరగోళంగా మారాయి.రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రె్‌సలో చేరేందుకు సిద్ధమై వెనక్కి వెళ్లిపోయారు. పార్టీలో చేరాలనుకుంటున్న నాయకుల భవిష్యత్తుకు హామీ ఇచ్చేవారు.. పార్టీలోని సీనియర్లకు నచ్చచెప్పి భరోసా ఇచ్చేవారు లేకపోయారు. ఉమ్మడి జిల్లాలో కొంత పట్టున్న మహేందర్ రెడ్డి పూర్తిస్థాయిలో మల్కాజి గిరిపైనే దృష్టి కేంద్రీకరించారు.ఈ నేపథ్యంలోనే, నిన్నమొన్నటి వరకు చేవెళ్ల పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడ గెలుపును సవాల్‌గా తీసుకుని పని చేస్తున్నారు.బీజేపీ తన అభ్యర్థిని ఎంతో ముందుగానే ప్రకటించింది! దాంతో, ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అందరి కంటే ముందే ప్రచారం ప్రారంభించారు. తాజా రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుంటూ దూసుకుపోతున్నారు. నిజానికి, ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో నాలుగు బీఆర్‌ఎస్, మూడు కాంగ్రెస్ గెలిచాయి.బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అప్పటి పరిస్థితులతో పోలిస్తే పూర్తి భిన్నమైన వాతావరణం ఇప్పుడు నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన కాషాయ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలకు సవాల్ విసురుతోంది. విశ్వేశ్వర్ రెడ్డి వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.భారీ బహిరంగ సభలు కాకుండా క్షేత్రస్థాయికి వెళ్లి ఆయా వర్గాలతో వేర్వేరుగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.తనను ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గంలో ఏమేం చేస్తానో చెబుతూ ‘చేవెళ్ల సంకల్ప పత్రాన్ని’ విడుదల చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా 3,700 కిలోమీటర్ల మేర తాను చేసిన ప్రజా ఆశీర్వాద యాత్రలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి ఇందులో సంకల్పం చెప్పుకొన్నారు.ప్రధాని మోదీ పేరునే ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకుని ఓట్లు అడుగుతున్నారు. ఆయన గెలుపు కోసం బీజేపీ కేడర్‌తోపాటు ఆ పార్టీ అనుబంధ సంస్థలు చాప కింద నీరులా పనిచేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పార్టీకి సానుకూల పరిస్థితులు ఉండడంతో గ్రామీణ ప్రాంతాలపై బీజేపీ ఎక్కువ ఫోకస్ పెడుతోంది.ఇక, విశ్వేశ్వర్ రెడ్డి భార్య, అపోలో ఆస్పత్రుల జేఎండీ సంగీతారెడ్డి కాలనీ అసోసియేషన్లు, మహిళా సంఘాలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ప్రచారంలోకి జాతీయ నాయకులను కూడా రంగంలోకి దింపాలని బీజేపీ నిర్ణయించింది. త్వరలో ప్రధాని మోదీ కూడా నియోజకవర్గంలో పర్యటించనున్నారు.చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మూడు సెగ్మెంట్లు హైదరాబాద్‌లో అంతర్భాగంగా ఉండగా మిగతా నాలుగు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో దాదాపు 65 శాతం పట్టణ ఓటర్లే. వీరిలో అత్యధికులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినవారే. గెలుపోటములను శాసించే స్థితిలో ఉండడంతో వీరి ఓట్లు కీలకంగా మారాయి.సిటింగ్ సీటును కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్ తంటాలు పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 4 సెగ్మెంట్లలో గెలవడమే కాకుండా లక్షకుపైగా ఓట్లను అధికంగా సాధించిన ఈ పార్టీ.. పార్లమెంటు ఎన్నికల్లో తొలి నుంచీ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది.సిటింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికే టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన కాంగ్రె్‌సలోకి వెళ్లిపోయారు. ఆయనతోపాటు కొంతమంది ముఖ్య నేతలు కూడా అదే బాట పట్టారు.బీసీల్లో కొంత పట్టున్న కాసాని జ్ఞానేశ్వర్‌ను బీఆర్‌ఎస్ బరిలోకి దింపింది. తద్వారా ఇక్కడ బీసీ కార్డును ప్రయోగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో మంచి పట్టు ఉండడంతో సబితారెడ్డికి బాధ్యతలను అప్పగించారు.
చేవెళ్లలో ట్రైయాంగ్యులర్ ఫైట్
- Advertisement -
- Advertisement -