కొత్త గవర్నర్ ఎవరు…?
హైదరాబాద్, మార్చి 19,
లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణకు కొత్త గవర్నర్ రానున్నారు. ఇంకా ఎవరు అన్నది తెలియకున్నా.. తెలంగాణకు రానున్న కొత్త గవర్నర్ ప్రభుత్వానికి ఏ మేరకు సహకరిస్తారన్నది ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణతో గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ గా కూడా ఆమె రాజీనామా చేసి రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను పంపిన తమిళి సై తమిళనాడుకు వెళ్లిపోయారు. ఇప్పుడు కొత్త గవర్నర్ ను నియమించాల్సి ఉంది. అయితే కొత్త గవర్నర్ ఈ ప్రభుత్వానికి ఏ మేరకు సహకరిస్తారన్నది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే తమిళి సై మాత్రం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించారనే అనుకోవాలి. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీసుకున్న రాజీనామా నిర్ణయం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఆమె స్థానంలో కొత్త గవర్నర్‌గా ఎవరు వస్తారు? ఎప్పుడొస్తారు? అనేది ఆసక్తిగా మారింది. ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్‌కు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కొత్త గవర్నర్ ఎంపీ ఎన్నికలకు ముందే వస్తారా? లేక ఆ తర్వాతే ఉంటుందా అనేది ఉత్కంఠగా మారింది. అయితే నియామకం ఆలస్యం అయితే తెలంగాణ బాధ్యతలను తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌లలో ఎవరికైనా అప్పగించబోతున్నారా? అనేది సస్పెన్స్‌గా మారింది.ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడమే టార్గెట్‌గా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో ఎంపీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతున్నదని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తుంటే, ఐదారు నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ నేతల మీటింగ్‌లో వ్యాఖ్యానిస్తున్నారనే వార్తలు రావడం సంచలనంగా మారుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్, బీజేపీ నేతల వరుస కామెంట్ల నేపథ్యంలో అనూహ్యంగా ప్రస్తుత గవర్నర్ తమిళిసై రాజీనామా చేయడం చర్చకు దారితీస్తోంది.తమ ప్రభుత్వం జోలికి వస్తే సహించేది లేదని ఓ వైపు రేవంత్ రెడ్డి ఫైర్ అవుతుంటే మరో వైపు రాష్ట్రంలో గవర్నర్ మార్పు వెనుక ఎదైనా భారీ వ్యూహం ఉందా అనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.కేసీఆర్‌పై ఉన్న కోపంతో తమిళిసై రేవంత్ రెడ్డి సర్కార్ విషయంలో పాజిటివ్‌గా ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇంతలోనే ఆమె రాజీనామా చేయడంతో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు ఏమైనా ప్రభావితం అవుతాయా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో తలపండిన వ్యక్తిని కొత్త గవర్నర్ పంపిస్తారా లేక న్యాయపరమైన అవగాహన కలిగిన మాజీ ఉన్నతాధికారిని నియమిస్తారా? అనేది వేచి చూడాలి.కేసీఆర్ రాజ్‌భవన్‌కు కూడా అత్యవసర సమయాల్లో తప్ప వెళ్లే వారు కాదు. హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం సమయంలోనే ఆయన రాజ్‌భవన్ కు వెళ్లేవారు. ఇక మంత్రులు కూడా రాజ్‌భవన్ వైపు చూసేవారు కాదు. అప్పటి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగాన్ని కూడా లేకుండా కేసీఆర్ మరింత దూరాన్ని పెంచుకున్నారు. ఇక శానసమండలి సభ్యుల నియామకాల్లోనూ, వివిధ ఫైళ్లను ఆమోదించి పంపడంలోనూ ఆమె ఆలస్యం చేసే వారు. చివరి మంత్రి వర్గ సమావేశంలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమించినా దానిని తిరస్కరించిన తమిళి సై తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన జాబితాను ఓకే చెప్పారు.రాజ్‌భవన్ తో రేవంత్ రెడ్డి కొంత సత్సంబంధాలు నడిపేవారు. గత ప్రభుత్వంలో తలెత్తిన ఇబ్బందులు రాకూడదని ఆయన తొలి నుంచి గవర్నర్ కు కొంత అనుకూలంగానే వ్యవహరించే వారు. గవర్నర్ కూడా పెద్దగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేవారు కాదు. కానీ తమిళి సై సౌందర్ రాజన్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాని భావించి గవర్నర్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవడంతో కొత్త గవర్నర్ నియామకం అనివార్యమయింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం… కేంద్రంలో ఉన్నది బీజేపీ సర్కార్. అందుకే కాంగ్రెస్ నేతల్లో కొంత బెరుకు… భయం పట్టుకుంది. పొరుగున ఉన్న తమిళనాడు తరహాలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే గవర్నర్ వస్తే ఎలా అన్న ఆందోళన మాత్రం ప్రభుత్వ పెద్దల్లో ఉంది.సహజంగానే కొత్తగా వచ్చే గవర్నర్ కొంత ప్రభుత్వానికి సహకరించకపోవచ్చన్న టాక్ మాత్రం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఎవరు వచ్చినా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందేనని కొంత సర్దిచెప్పుకున్నా.. ప్రభుత్వ నిర్ణయాలను ఆమోదించడం..తో పాటు కొర్రీలు వేయకుండా ఉండే గవర్నర్ రావాలని ప్రస్తుత ప్రభుత్వం కోరుకుంటుంది. కానీ అంతా అనుకున్నట్లు జరిగితే ఇక రాజకీయాలు ఎలా అవుతాయి? అందుకే రాజ్్‌భవన్, శాసనసభ మధ్య రానున్న కాలంలో ఎలాంటి సంబంధాలు కొనసాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. గవర్నర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కొంత కాలం గడిస్తే కాని ఈ సందేహాలకు సమాధానం దొరకదు. అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే.
కొత్త గవర్నర్ ఎవరు…?
- Advertisement -
- Advertisement -