Breaking News
Saturday, July 27, 2024
Breaking News

ప్రత్యర్థుల డిపాజిట్స్ గల్లంతేనా…?

- Advertisement -
can-opponents-deposits-be-lost
can-opponents-deposits-be-lost

ఈ సారీ.. ‘తారక’ మంత్రమే!

కేటీఆర్‌దే విజయం

బలమైన అభ్యర్థులు లేని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌

గత కొన్ని రోజులుగా జిల్లాలో కేటీఆర్‌ విస్తృత పర్యటనలు

సిరిసిల్ల: రాష్ట్రంలో సిరిసిల్ల నియోజకవర్గం అంటే రాజకీయ వర్గాల్లో ఒక ప్రత్యేకత సంతరించుకున్న నియోజకవర్గం. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుమారుడు, డీ–ఫ్యాక్టో సీఎం, యువరాజు, జూనియర్‌ బాస్‌ ఇలా పార్టీ వర్గాలు రకరాలుగా పేర్లు పెట్టి పిలుచుకునే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి.. తండ్రి ఆదేశం మేరకు తెలంగాణ మలి దశ ఉద్యమం ప్రారంభం నుంచి బీఆర్‌ఎస్‌లో అన్నీ తానై వ్యవహరిస్తున్న కేటీఆర్‌.. 2009లో అసెంబ్లీలో అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి 2018 వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగిస్తున్న కేటీఆర్‌.. ఈ సారి కూడా సిరిసిల్లలో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయం అనే నిశ్చితాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

can-opponents-deposits-be-lost
can-opponents-deposits-be-lost

అభివృద్ధి పనులే.. ఆశీస్సులు

బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కేటీఆర్‌.. సిరిసిల్ల నియోజకవర్గంలో మళ్లీ గెలుస్తారనే ధీమా వెనుక.. నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనులే ప్రజల ఆశీస్సులు అందేలా చేస్తాయనే అభిప్రాయం వినిపిస్తోంది. నర్సింగ్‌ కాలేజ్‌ ఏర్పాటు, అగ్రికల్చర్‌ కాలేజ్, పాలిటెక్నిక్‌ కాలేజ్, వంద పడకల ఆస్పత్రి నిర్మాణం, ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మాణం, నాలుగు లైన్ల బైపాస్‌ రోడ్డు నిర్మాణం వంటి పలు పనులను కేటీఆర్‌ స్వీయ పర్యవేక్షణలో పూర్తయ్యాయి. అంతేకాకుండా.. అపరెల్‌ పార్క్, వర్కర్‌ టు ఓనర్‌ స్కీం పనులు త్వరలో పూర్తి కానున్నాయి. దీంతోపాటు.. మెడికల్‌ కాలేజ్‌ సైతం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అదే విధంగా కేటీఆర్‌ తన సొంత ఖర్చులతో నేత కార్మికులకు ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లోనూ కేటీఆర్‌కే పట్టం కట్టేందుకు దోహదం చేస్తాయనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

సెస్‌ ఎన్నికల్లోనూ విజయభేరి

గత ఏడాది సిరిసిల్లలో నిర్వహించిన సిరిసిల్ల కోఆపరేటివ్‌ ఎలక్ట్రిక్‌ సప్లయ్‌ సొసైటీ (సెస్‌) ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ విజయభేరి మోగించింది. మొత్తం 15 డైరక్టర్‌ పదవులకుగాను 13 డైరక్టర్లు బీఆర్‌ఎస్‌ నుంచే గెలిచారు. ఈ విజయం వెనుక కూడా కేటీఆర్‌ తారక మంత్రం ఫలించిందని, ఆయన వ్యూహ, ప్రతి వ్యూహాలే పార్టీకి నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ఇస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

can-opponents-deposits-be-lost
can-opponents-deposits-be-lost

కాంగ్రెస్‌.. సైలెంట్‌

రాష్ట్రం మొత్తంలో గ్రాఫ్‌ పెంచుకుంటూ.. జోష్‌ మీదున్న కాంగ్రెస్‌ పార్టీ మాత్రం సిరిసిల్ల నియోజకవర్గం విషయంలో పూర్తి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కేటీఆర్‌పై ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా, మరో రెండు సార్లు కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన కె.కె. మహేందర్‌ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. దీంతో.. పీసీసీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే.. కేటీఆర్‌దే గెలుపు అనే సర్వేల విశ్లేషణలతో మహేందర్‌ రెడ్డి నిర్లిప్తతకు లోనవుతున్నారని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. హాత్‌ సే హాత్‌ యాత్రలో భాగంగా సిరిసిల్లలో బహిరంగ సభలో కేటీఆర్, కేసీఆర్‌లపై విమర్శలు గుప్పించినప్పటికీ.. వాటిని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పెండింగ్‌ పనులపై కాంగ్రెస్‌ దృష్టి

మరోవైపు.. కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గంలో పెండింగ్‌ పనులు, స్కీమ్‌లపై దృష్టి పెట్టి వాటిని ప్రభుత్వ వైఫల్యాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు నియోజవకర్గంలో తొమ్మిదో ప్యాకేజ్‌ పనులు పూర్తి కాకపోవడం, నేతన్నలకు మార్కెట్‌ సదుపాయం లేకపోవడం, బీడీ కార్మికులకు కేంద్రం హామీ ఇచ్చిన ఆస్పత్రి పనులు జాడ లేకపోవడం వంటి వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. అంతేకాకుండా.. చేనేత కార్మికులకు ఏడాది మొత్తం పని కల్పించే విధానాలను అమలు చేస్తామని, అదే విధంగా కుటీర మగ్గాలకు ఉచిత విద్యుత్‌ హామీ ఇచ్చే దిశగాగానూ కాంగ్రెస్‌ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం. ఇలా పెండింగ్‌ పనులు, కొత్త హామీలతో ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది.

can-opponents-deposits-be-lost
can-opponents-deposits-be-lost

బీజేపీ.. నేతలు కరవు

కరీంనగర్‌లోని ఇతర నియోజకవర్గాల్లో మాదిరిగానే.. ఈ నియోజకవర్గంలో బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారు. కటకం మృత్యుంజయరావు, రెడ్డిబోయిన గోపి, రమాకాంత్‌ రావు వంటి వారు టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే.. నియోజకవర్గంలో తమ బలం అంతగా లేదని భావిస్తున్న బీజేపీ పెద్దలు.. కనీసం గౌరవప్రదమైన ఓట్లు పొందేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న చేనేత ఓటర్లను తమవైపు తిప్పుకునేలా అదే సామాజిక వర్గానికి చెందిన లగిశెట్టి శ్రీనుకు టికెట్‌ ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మెజారిటీపైనే.. చర్చ

ఇదిలా ఉంటే.. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ఈ నియోజవర్గంపై ఆశలు వదులుకున్న రీతిలోనే వ్యవహరిస్తున్నారు. దీంతో.. ఈ సారి కేటీఆర్‌కు వచ్చే మెజారిటీ ఎంత అనేదే ఇక్కడ ప్రధాన అంశంగా మారుతోంది. మొట్టమొదటసారి 2009లో కేవలం 171 ఓట్లతో గెలిచిన కేటీఆర్‌ ఆ తర్వాత ఆ మెజారిటీని పెంచుకుంటున్నారు. 2010 ఉప ఎన్నికల్లో 68,220 ఓట్ల మెజారిటీ, 2014లో 53,004 ఓట్ల మెజారిటీ, 2018లో ఏకంగా 51 శాతం ఓట్లతో  89,009 ఓట్ల మెజారిటీ వచ్చింది. దీంతో.. ఈ సారి ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారు అనేదే ఆసక్తికరంగా మారింది.

బీసీ ఓటర్లదే నిర్ణయం

నియోజకవర్గంలో నిర్ణయాత్మకంగా మారుతున్న ఓటర్ల విషయంలో బీసీ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 2.10 లక్షల ఓటర్లు ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో చేనేతలు దాదాపు 26 వేలు ఉంటారని అంచనా. వీరితోపాటు గౌడ సామాజిక వర్గం ఓటర్లు 25 వేల వరకు ఉంటారు. వీరితో పాటు ముదిరాజ్, మున్నూరు కాపు వర్గాల ఓటర్ల కూడా 60 వేలకుపైగా ఉంటారని తెలుస్తోంది. అయితే.. ఎన్నికల్లో  నేతల ఓట్లు మెజారిటీని పొందడంలో కీలకంగా మారడంతో అన్ని పార్టీల వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం. కేటీఆర్‌ మెజారిటీని గతం కంటే కొంత తగ్గించినా చాలనే ధోరణి ఇతర పార్టీల్లో కనిపిస్తోందనే వ్యాఖ్యలు సైతం వినిపిస్తుండడం గమనార్హం.

మొత్తంగా చూస్తే.. సిరిసిల్లలో విజయం బీఆర్‌ఎస్‌దే అనే విషయం సుస్పష్టంగా వినిపిస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్, బీజేపీలు తమ ఉనికిని, ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి.

సిరిసిల్ల నియోజకవర్గం ముఖ్యాంశాలు

మొత్తం ఓటర్లు: దాదాపు 2.10 లక్షలు

చేనేత ఓటర్లు: దాదాపు 26 వేలు

ఎన్నికల్లో కీలకంగా చేనేత ఓట్లు

తర్వాత స్థానంలో గౌడ, ముదిరాజ్, మున్నూరు కాపు ఓట్లు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!