Breaking News
Saturday, July 27, 2024
Breaking News

చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్

- Advertisement -

ఇస్రో చారిత్రాక ఘట్టానికి గంటల సమయం

ప్రపంచమంతా ఎదురుచూపులు

శ్రీహరికోట, ఆగస్టు 22: మరికొన్ని గంటల్లో ఇస్రో చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా నిలిచేందుకు సిద్ధమైంది. బుధవారం ఉదయం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత పకడ్బందీగా తీర్చిదిద్దిన విక్రమ్ ల్యాండర్ ప్రణాళికాబద్ధంగా ల్యాండ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. విక్రమ్ ల్యాండర్ సజావుగా దిగితే.. చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారత్ నిలుస్తుంది. అయితే ఇక్కడితో పని అయిపోలేదు.చంద్రయాన్‌-3 మిషన్ షెడ్యూల్ ప్రకారం సాఫీగా సాగుతోందని ఇస్రో ప్రకటించింది. సిస్టమ్స్ అన్నీ తనిఖీ చేపట్టామని అన్నీ నార్మల్‌గా వర్క్ చేస్తున్నట్టు పేర్కొంది. విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ ప్రక్రియను ఆగస్టు 23 సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నట్టుఇస్రో ప్రకటించింది. రెండు రోజుల క్రితం చంద్రునికి దాదాపు 70 కి.మీ ఎత్తు నుండి తీసిన ఫొటోలను ఇస్రో షేర్ చేసింది. ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా ద్వారా ఈ చిత్రాలను సేకరించారు. LPDC పంపిన చిత్రాలు ల్యాండర్ మాడ్యూల్‌ను ఆన్‌బోర్డ్ మూన్ రిఫరెన్స్ మ్యాప్‌తో సరిపోల్చడం ద్వారా దాని గమనాన్ని తెలుసుకోవచ్చని పేర్కొంది. విక్రమ్ ల్యాండిగ్‌ అనేది చంద్రయాన్-3 ప్రయోగంలో సగం మాత్రమే. మరో సగం.. ల్యాండర్ దిగిన తర్వాత ప్రారంభం అవుతుంది. అయితే సాఫ్ట్ ల్యాండింగే ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఈ దశలోనే చంద్రయాన్-2 విఫలమైంది. మరి చంద్రయాన్-3 లో భాగంగా చంద్రుడిపైకి చేరిన విక్రమ్ ల్యాండర్‌ అద్భుతాలు చేస్తుందని ఇస్రో అంచనా వేస్తోంది. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై ఒక రోజు తనకు నిర్దేశించిన కార్యకలాపాలు సాగించనుంది. చంద్రుడిపై ఒక రోజు అంటే భూమిపై 14 రోజులకు సమానం. ప్రజ్ఞాన్ రోవర్ లోని ఐదు మాడ్యుల్స్‌ నుంచి వచ్చే టన్నుల కొద్దీ డేటాను విశ్లేషించడం ఇక్కడ భారతీయ శాస్త్రవేత్తల పని. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన సుమారు 4 గంటల తర్వాత ల్యాండర్ కు ఒక వైపు ఉన్న ప్యానెల్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఓ ర్యాంప్ వస్తుంది. ఈ ర్యాంప్ పై నుంచి 6 చక్రాలు ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపైకి దిగుతుంది. జాతీయ త్రివర్ణ పతాకం, చక్రాలకు ఇస్రో లోగోతో ప్రజ్ఞాన్ రోవర్ దిగుతుంది. సెకనుకు ఒక సెంటీమీటర్ వేగంతో రోవర్ కదులుతూ చంద్రుని పరిసరాలను స్కాన్ చేస్తూ ఆ డేటాను ల్యాండర్ కు పంపిస్తుంది. పేలోడ్స్ కాన్ఫిగర్ చేసిన టూల్స్ ఆ డేటాను గ్రహిస్తాయి. మూడు పేలోడ్స్ విక్రమ్ ల్యాండర్ ఉపరితల ప్లాస్మా (అయాన్లు, ఎలక్ట్రాన్ లు) సాంద్రతను కొలుస్తుంది. చంద్రుడి ఉపరితలం ఉష్ణ లక్షణాల కొలతలను నిర్వహిస్తుంది. ల్యాండింగ్ సైట్ చుట్టూ భూ స్వభావాన్ని అంచనా వేస్తుంది. లూనార్ క్రస్ట్, మాంటిల్ నిర్మాణాలను పరిశీలిస్తుంది. సౌరశక్తితో నడిచే ల్యాండర్, రోవర్ చంద్రుని పరిసరాలనను అధ్యయనం చేయడానికి సుమారు 2 వారాల సమయం పడుతుంది. రోవర్ కేవలం ల్యాండర్ తో మాత్రమే కమ్యూనికేట్ చేస్తుంది. ల్యాండర్ భూమిపై ఉన్న శాస్త్రవేత్తలతో కనెక్షన్ కలిగి ఉంటుంది. చంద్రయాన్-2 ఆర్బిటర్ ను కంటింజెన్సీ కమ్యూనికేషన్ రిలేగా కూడా ఉపయోగించవచ్చని ఇస్రో తెలిపింది.సోమవారం, చంద్రయాన్-2 ఆర్బిటర్ ల్యాండర్ మాడ్యూల్ తో కమ్యూనికేషన్ ను ఏర్పాటు చేసింది. 14 రోజుల్లో రోవర్ ఎంత దూరం ప్రయాణిస్తుంది అనేది చెప్పలేమని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. రోవర్ ప్రయాణం వివిధ అంశాలపై(కాలుక్యులేషన్స్) ఆధారపడి ఉంటుందన్నారు. దక్షిణ ధ్రువంలో రాత్రి ఉష్ణోగ్రత ఏకంగా మైనస్ 238 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతుంది. ల్యాండర్, రోవర్ రెండో రోజు కూడా పని చేయాలంటే.. ఈ గడ్డకట్టే అత్యంత చలి ఉష్ణోగ్రతను తట్టుకోవాలి. ల్యాండర్, రోవర్ రెండూ చంద్రుడిపై రెండో రోజు కూడా పని చేసే అవకాశం ఉందని ఇస్రో చైర్మన్ తెలిపారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!