గృహజ్యోతి’ పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా పొందేందుకు ఇళ్లల్లో అద్దెకుండే కుటుంబాలకూ అర్హత ఉంటుందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) మంగళవారం ఎక్స్‌లో తెలిపింది. అద్దెకున్న వారికి ఈ పథకం వర్తించదంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తుండడంతో సంస్థ ఈ వివరణ ఇచ్చింది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇటీవల ‘ప్రజాపాలన’లో ఈ పథకానికి 81,54,158 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత నెల ఒకటి నాటికి రాష్ట్రంలో 1.31కోట్ల ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 2022-23 ఏడాదిలో సగటున నెలకు 200 యూనిట్లలోపు వినియోగించిన ఇళ్లు ఎన్ని ఉన్నాయో డిస్కంలు పరిశీలిస్తున్నాయి. ప్రభుత్వం నిబంధనలను విడుదల చేశాక అర్హుల గుర్తింపుపై మరింత స్పష్టత వస్తుందని విద్యుత్ అధికారులు తెలిపారు.