అవినీతికి తావు లేకుండా పాలన
విజయవాడ సెప్టెంబర్ 29 : వరుసగా ఐదో ఏడాది ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వాహన మిత్ర నిధులను విడుదల చేశారు. విజయవాడలో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఈక్రమంలోనే ఆటో డ్రైవర్లు అందజేసిన ఖాకీ చొక్కాను ధరించారు. బతుకు బండిని లాగడానికి ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కోసమే ఈ పథకం ప్రారంభించినట్లు చెప్పారు. వాహనం ఇన్సూరెన్స్, ఇతర ఖర్చుల కోసమే వైఎస్సార్ వాహన మిత్ర అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగానే సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా ఇచ్చిన డబ్బులను దేనికోసమైనా వాడుకోవచ్చని చెప్పారు. కానీ వాహనాల ఫిట్ నెస్ సర్టిఫికేట్, ఇన్సారెన్స్ రెన్యూవల్ మాత్రం చేయించుకొని దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. ఈరోజు మొత్తం రూ. 276 కోట్ల రూపాయలు జమ చేశామని దీని ద్వారా ఒక్కొక్కరికీ రూ.50 వేలు లబ్ధి జరుగుతోందన్నారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకం అమలు చేస్తున్నందుకు గర్వపడుతున్నామని వెల్లడించారు. ఇది జగనన్న ప్రభుత్వం కాదని.. ఇది మీ అందరి ప్రభుత్వం అని వివరించారు.
ఎంతో మంది ప్రయాణికులకు సేవలు అందించే ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వైసీపీ సర్కారు ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే పథకాలు అన్నీ అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అవినీతికి తావు లేకుండా వాలంటీర్ వ్యవస్థతో పాలనను ప్రజలకు చేరువ చేశామన్నారు. ఆర్బీకేలతో రైతులకు అండగా నిలిచామని.. పాదయాత్రలో మీ అందరి కష్టాలు చూశానంటూ చెప్పుకొచ్చారు. మీ సమస్యలకు పరిష్కారంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రైతన్నకు రూ.30,985 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా సాయం అందిస్తామన్నారు. మత్స్యకార కుటుబాలకు కూడా అండగా నిలిచామన్నారు. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అంటే పేదల గొంతుకై నిలబడిన ప్రభుత్వం తమదంటూ వివరించారు. చిరు వ్యాపారులకు రూ.2,965 కోట్లు సాయం అందించామన్నారు. అలాగే వైఎస్సార్ కాపు నేస్తంతో రూ.2,029కోట్లు, వైఎస్సార్ ఈబీసీ నేస్తంతో రూ.1257 సాయం అందించామని గర్వంగా తెలిపారు. మరోవైపు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం జగన్ హయాంలోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందిందని చెప్పాు. రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్ల వేలాది కుటుంబాలు నిశ్చితంగా ఉంటున్నాయని వివరించారు. అలాగే అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, పార్కులు నిర్మించడం వంటి ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు