పాలమూరు కష్టాలు తీరినట్లే
హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతుల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘ ప్రయత్నాలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు రెండేళ్ల క్రితమే ప్రాజెక్టు ఫలితాలు ప్రజలకు అందాల్సి ఉన్నది. ఒక వైపు ఇంటి దొంగల కేసులు, పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు, మరో వైపు కేంద్ర ప్రభుత్వం సహకరించని తీరుతో నిర్దిష్ట సమయంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయి త్వరలో నీళ్లివ్వడానికి సిద్దమయ్యాం. మిగిలిన పనులను వీలయినంత తొందరగా పూర్తి చేస్తాం .. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా విడుదల చేస్తామని అన్నారు.
కేసీఆర్ మాట ఇచ్చినట్లు పాలమూరు ప్రజల కాళ్లను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కృష్ణమ్మ నీళ్లతో తడుపుతానని, మడి, మడి తడుపుతానని శపథం చేశారు. ఆ కల త్వరలోనే నెరవేరబోతున్నది. 55, 60 ఏళ్ల జిల్లా ప్రజల వెతలు సంపూర్ణంగా తీరే శుభసమయం ఆసన్నమవుతున్నది. రైతులు, ప్రజలు వేయి కళ్లతో ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నార్లాపూర్ , ఏదులలో పంపుల ఎరెక్షన్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఈ అనుమతుల కోసం ఆగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘ వ్యూహానికి, ముందుచూపుకు ఇది ప్రతీక. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును తీసుకువెళ్లడం అనే అనితర సాధ్యమైన పని కేసీఆర్ గారికే సాధ్యమయింది .. మరెవరివల్లా ఇది సాధ్యం అయ్యేది కాదని అన్నారు.