ఆర్టీసీని నంబర్ 1 రవాణా సంస్థగా ఉంచే ప్రయత్నం: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ప్రజల సంస్థ అని, అందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద 800 మందికిపైగా నియామకాలు ఇవ్వడం జరుగుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్‌లో టీఎస్ ఆర్టీసీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీ వీ.సీ. సజ్జనార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇది నిరంతర ప్రక్రియ అని, అందులో భాగంగా ఈరోజు కొంతమంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్టీసీ సంస్థను తిరిగి తెలంగాణ ప్రజలకు నంబర్ 1 రవాణా సంస్థగా ఉంచే ప్రయత్నం జరుగుతోందన్నారు.
గతంలో కరోనా, సమ్మె కారణంగా ఆర్టీసీకి పలు సమస్యలు ఏర్పడ్డాయని, వాటన్నిటిని అధిగమించడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటుందని మంత్రి పొన్నం అన్నారు. నూతనంగా మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఉచితంగా మహిళలకు ప్రయాణం అందిస్తున్నామని, ఇప్పటి వరకు 14 న్నర కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. అక్యూపెన్సీ రేషియో బస్ స్టాండ్‌లు ఖాళీగా ఉన్న పరిస్థితి నుంచి బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో నూతన బస్సుల కొనుగోలు, నూతన సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేబినెట్ సహకారంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మార్గదర్శకంలో ముందుకు వెళుతున్నామని, ప్రజలంతా సహకరించాలని కోరారు. ఆర్టీసీ మనందరిదని దానిని కాపాడుకోవాలన్నారు. ఆర్టీసీని ముందుకు తీసుకుపోవడంలో అందరి సలహాలు కోరుతూ ఆర్టీసీ సంస్థను ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు..