ఆ రెండు రోజులు పెయిడ్ హాలీడే
హైదరాబాద్, మే 7
లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో పాల్గొనేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు మే 13న పెయిడ్ హాలిడే ప్రకటించింది. ఎన్నికల ఫలితాల తేదీ జూన్ 4న కూడా వేతనంతో కూడా సెలవును ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వేతనంతో కూడిన సెలవులను అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13, 2024న ఒకే దశలో జరగనున్నాయి. కాగా మొత్తం ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. రాష్ట్రంలో వడగాలుల కారణంగా 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంటే.. ఒక గంట పొడిగించారు.మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో భాగమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లు మే 13న రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి లోక్‌సభ ఎన్నికలకు, మరొకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో లోక్ సభ ఎన్నికలతో పాటుగా ఆ రోజున బై ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం 3,986 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు అధికారులు. 23,500 మంది ఉద్యోగులను ఎన్నికల సిబ్బందిగా నియమించారు. అవగాహన కార్యక్రమాల ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం విస్తృతంగా కృషి చేస్తోంది.ఇక సామాజిక మధ్యామాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే.. ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను హెచ్చరించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే అసత్య ప్రచారాలను, రెచ్చగొట్టే కామెంట్స్ పోస్టు చేయడం తగదని సూచించింది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులకు సూచనలు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.